పవన్‌ కు హై లెవల్‌ సెక్యూరిటీ!

పవన్‌ కళ్యాణ్‌ జూన్‌ 19న సచివాలయంలో తన బాధ్యతలను స్వీకరించనున్నారు.

Update: 2024-06-18 05:48 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర జనసేనాని పవన్‌ కళ్యాదేననే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి కీలక శాఖలను ఆయన ఎంచుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ జూన్‌ 19న సచివాలయంలో తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటికే సచివాలయం సెకండ్‌ బ్లాక్‌ లో ఆయన కార్యాలయాన్ని సర్వ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ప్రొటోకాల్‌ విషయంలో తనతో సమానంగా పవన్‌ కళ్యాణ్‌ కు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చాంబర్‌ కు తగ్గ రీతిలో సచివాలయంలో పవన్‌ ఉండే బ్లాక్‌ లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన చిత్రపటాలతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చిత్రపటాలను కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు చిత్రపటాలతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ చిత్రపటాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇంకోవైపు పవన్‌ కళ్యాణ్‌ భద్రత విషయంలోనూ ప్రభుత్వం రాజీపడటం లేదు. గతంలో పలుమార్లు పవన్‌ తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఎన్నికల ముందు పిఠాపురంలో మాట్లాడుతూ కొంతమంది దుండగులు తమ కార్యకర్తల్లో కలిసిపోయి తన భద్రతా సిబ్బందితోపాటు తన చేతులను బ్లేడులతో కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ అధినేతగానే కాకుండా స్టార్‌ హీరోగా కూడా పవన్‌ ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడంతో ప్రభుత్వం ఆయనకు హైలెవల్‌ భద్రతను కల్పించాలని నిర్ణయించింది. పవన్‌ కళ్యాణ్‌ కు వై ప్లస్‌ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును కేటాయించింది.

పనవ్‌ కళ్యాణ్‌ కాన్వాయ్‌ లో ఒక ఎస్పీజీ కమాండో, ఇంకా రెండు ఎన్‌ఎస్‌జీ కమాండోలతో కూడిన రెండు కార్లు ఉంటాయని తెలుస్తోంది. సీఆర్పీపీఎఫ్‌ సిబ్బందితో కూడిన రెండు కార్లు, ఒక జామర్‌ వాహనం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదించిందని తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర రక్షణ విభాగాలతో పవన్‌ కళ్యాణ్‌ కు భద్రత కల్పించాలని కోరినట్టు సమాచారం.

Tags:    

Similar News