ఛాన్సు దొరికితే జగన్ ను వదిలి పెట్టని పవన్

ఈ సందర్భంగా తనకు లభించిన చిన్న గ్యాప్ లోనూ వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-12-31 04:41 GMT

తనకు ఎవరూ శత్రువులు ఉండరన్న మాటను పదే పదే ప్రస్తావిస్తుంటారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఆయన మాటలు ఆ రీతిలో ఉన్నప్పటికి.. కొన్ని అంశాల్ని నిగూఢంగా చూస్తే మాత్రం. పవన్ మాటల్లో కొంత కరెక్షన్ చేయాలనిపించక మానదు. పుష్ప బెనిఫిట్ షో ఎపిసోడ్ పై సావధానంగా స్పందించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా తనకు లభించిన చిన్న గ్యాప్ లోనూ వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టటమే కాదు.. చిత్రపరిశ్రమకు ఆయన కారణంగా ఎంత నష్టం జరిగిందన్నది మరిచారా? అన్నట్లుగా చెప్పిన మాటలు చూస్తే.. జగన్ ను పవన్ చూసే ధోరణి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. పుష్ప సినిమా కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేసినంత ఇంకెవరూ చేయలేదని చెబుతూ.. తాను ఆ మాట ఎందుకు చెప్పానో చెప్పేశారు.

అయితే.. రేవంత్ ను ప్రశంసించే వేళలో.. జగన్ ను విమర్శించే అవకాశాన్ని పవన్ వదులుకోకపోవటం కనిపిస్తుంది. పుష్ప సినిమాకు రేవంత్ ఇచ్చిన ప్రోత్సాహం ఎక్కడా ఇవ్వలేదని చెబుతూ.. జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. నిజానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన అనుమతులు.. టికెట్ల పెంపునకు సానుకూలంగా స్పందించిన వైనాన్ని చెప్పొచ్చు. కానీ.. జగన్ ను రెండు మాటలు అనేందుకు తనకు లభించిన చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి పవన్ కల్యాణ్ సిద్దంగా లేరన్న విషయం ఆయన తాజా మాటలు చెప్పేశాయని చెప్పాలి.

"పుష్ప సినిమాకు సీఎం రేవంత్ ఇచ్చిన ప్రోత్సాహం ఎక్కడా ఇవ్వలేదు. జగన్ లా ఆయన సినిమా పరిశ్రమను నలిపెయ్యలేదు. ధరలు పెంచారు. బెనిఫిట్ షోలకు.. అదనపు ఆటలకు అనుమతులు ఇచ్చారు" అని చెప్పటం ద్వారా సీఎం రేవంత్ ను పల్లెత్తు మాట కూడా అనాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారని చెప్పాలి. తన సినిమా విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం తనను ఎంతలా ఇబ్బంది పెట్టిందన్నది పవన్ తాజా వ్యాఖ్యలే నిదర్శనండా చెప్పక తప్పదు.

Tags:    

Similar News