ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమి: న్యూజిలాండ్ ప్రధాని చమత్కారం.. నవ్వేసిన మోడీ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించిన విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాని ప్రస్తావించారు.;
చాంపియన్స్ ట్రోఫీ.. ఈ విజయం కేవలం భారతీయులను ఆనందపెట్టి.. న్యూజిలాండర్లను బాధపెట్టడమే కాదు.. ప్రధానులను సైతం ఉప్పొంగేలా చేసింది. భారత ప్రధాని నరేంద్రమోడీని నవ్వించింది. న్యూజిలాండ్ ప్రధానిని బాధపెట్టింది. ఈ సందర్భంగా ఇండియాలో న్యూజిలాండ్ ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చి నవ్వులు పూయించింది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ భేటీలో ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించిన విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాని ప్రస్తావించారు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఓటమి గురించి ప్రధాని మోదీ మాట్లాడకపోవడం నిజంగా అభినందనీయం. అదే సమయంలో నేను కూడా భారతదేశంలో న్యూజిలాండ్ సాధించిన టెస్ట్ విజయాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. దానిని అలానే ఉంచి, దౌత్యపరమైన ఇబ్బందిని నివారిద్దాం," అని లక్సన్ చమత్కరించారు.
దీంతో ప్రధాని మోదీతో పాటు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. అక్కడ ఉన్న వారందరూ నవ్వారు. గత సంవత్సరం న్యూజిలాండ్ భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న జట్లలో భారత్ ఒకటని న్యూజిలాండ్ ప్రధాని అన్నారు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించినప్పుడు భారత్ చాలా మంది హృదయాలను ఎలా బాధించిందో లక్సన్ వివరించారు.
"ప్రధాని మోదీ హయాంలో భారత క్రికెట్ జట్టు క్రికెట్‌లో అత్యంత ఆధిపత్యం చెలాయించిన జట్టుగా నిలిచింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో నా 'బ్లాక్ క్యాప్స్' (న్యూజిలాండ్ క్రికెట్ జట్టు) పై విజయం సాధించింది. ఈ క్రమంలో, వారు నా హృదయంతో సహా చాలా మంది న్యూజిలాండ్ ప్రజల హృదయాలను బద్దలు కొట్టారు. నేను వారికి అభినందనలు తెలుపుతున్నాను," అని లక్సన్ అన్నారు.
కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ , న్యూజిలాండ్‌లను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌లో మళ్లీ న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
-భారత్-న్యూజిలాండ్ సంబంధాలు..
భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ప్రత్యక్ష సంబంధాలు 1950లలో ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇరు దేశాలు వివిధ అంతర్జాతీయ వేదికల మీద కలిసి పనిచేశాయి. ముఖ్యంగా, కామన్వెల్త్ సమావేశాలలో ఇరు దేశాల నాయకులు క్రమం తప్పకుండా కలుసుకుంటూ పరస్పర సహకారం గురించి చర్చించారు.భారత్ - న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యవసాయం, విద్య, పర్యాటకం, సాంకేతికత వంటి రంగాలలో ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి. న్యూజిలాండ్ నుండి భారతదేశానికి పాల ఉత్పత్తులు, కలప , ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా, భారతదేశం నుండి న్యూజిలాండ్‌కు ఫార్మాస్యూటికల్స్, వస్త్రాలు , ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచడానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి.