ఎల్లయ్యో, పుల్లయ్యో వచ్చి పోటీ చేస్తానంటే చేతులు ముడుచుకు కూర్చోను!

కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గమిది

Update: 2024-02-26 04:26 GMT

కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పెనమలూరు ఒకటి. కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గమిది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉయ్యూరు రద్దయి పెనమలూరు ఏర్పడింది. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కొలుసు పార్థసారధి పెనమలూరు నుంచి విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ గెలుపొందారు. 2019లో పార్థసారధి వైసీపీ నుంచి విజయం సాధించారు.

కాగా వచ్చే ఎన్నికల్లో పార్థసారధికి వైసీపీ అధినేత జగన్‌ సీటు నిరాకరించారు. దీంతో పార్థసారధి టీడీపీ నుంచి నూజివీడు సీటును దక్కించుకున్నారు. టీడీపీ తొలి విడత జాబితాలోనే ఆయనకు సీటు లభించింది.

మరోవైపు పెనమలూరు సీటును వైసీపీ... మంత్రి జోగి రమేశ్‌ కు కేటాయించింది. జోగి రమేశ్‌ ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి తప్పించి పెనమలూరు బరిలో దింపింది.

కొలుసు పార్థసారధికి పెనమలూరు టీడీపీ సీటును ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో బోడె ప్రసాద్‌ కు సీటు దక్కదని టాక్‌ నడిచింది. అయితే కొలుసుకు నూజివీడు ఇవ్వడంతో బోడె ప్రసాద్‌ కు అడ్డంకులు తొలగినట్టేనని అంతా భావించారు.

అయితే ట్విస్టుల మీద ట్విస్టులన్నట్టు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఆ పార్టీని వీడారు. ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో మైలవరం సీటును కొత్త అభ్యర్థి తిరుపతిరావుకు జగన్‌ కేటాయించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్‌ ఈసారి టీడీపీ తరఫున మైలవరంలో పోటీ చేయొచ్చని అంటున్నారు.

మరోవైపు మైలవరంలో ఇప్పటికే టీడీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంచార్జిగా ఉన్నారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్‌ కు మైలవరం సీటు ఇస్తే దేవినేని ఉమాను పెనమలూరు నుంచి పోటీ చేయించవచ్చని ప్రచారం జరుగుతోంది. అలా కాకుండా దేవినేని ఉమాను యధావిధిగా మైలవరంలోనే పోటీ చేయించి వసంత కృష్ణప్రసాద్‌ కు మైలవరం సీటును ఇవ్వొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెనమలూరు టీడీపీ ఇంచార్జిగా ఉన్న బోడె ప్రసాద్‌ కు సీటు దక్కకపోవచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే ఉన్న అభ్యర్థులు చాలరన్నట్టు దివంగత టీడీపీ నేత, గతంలో ఉయ్యూరు నుంచి టీడీపీ తరఫున ఒకసారి, ఇండిపెండెంట్‌ గా మరోసారి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన చలసాని పండు కుమార్తె స్మిత సైతం ఇంటింటికీ తానే అభ్యర్థినంటూ తిరుగుతున్నారు. ఆమె తన భర్తతో కలిసి ప్రతి గడప తడుతున్నారు. ఇప్పటికే ఉయ్యూరులో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెనమలూరులో సీటు తనకే వస్తుందని బోడె ప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి ఎల్లయ్యో, పుల్లయ్యో వచ్చి పెనమలూరులో పోటీ చేస్తానంటే తాను చేతులు కట్టుకుని కూర్చొనే వ్యక్తిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ పెనమలూరు సీటును తనకు కాకుండా వేరే వ్యక్తులకు కేటాయిస్తే రెబల్‌ గా పోటీ చేస్తానని చెప్పడమే బోడె ప్రసాద్‌ వ్యాఖ్యల ఉద్దేశమని అంటున్నారు. ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలో ఆయన చురుగ్గా పర్యటిస్తున్నారు.

చంద్రబాబు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన తొలి విడత జాబితాలో పెనమలూరు సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags:    

Similar News