ప్రతిపక్షం లేకుండానే...ఇది మంచి ట్రెండేనా ?

ఆ విధంగా జరిగితే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ఎంత వరకూ మేలు చేస్తుంది అన్న ధర్మ సందేహాలూ మేధావుల నుంచి ఎదురవుతున్నాయి.

Update: 2024-11-26 03:50 GMT

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారి పేరున రాజ్యం చేసేది ప్రజా ప్రతినిధులు. ఈ పదంలోనే ప్రజల ప్రతినిధులు అన్న అర్ధం ఉంది. ప్రజలు ఎవరి మీద దయ తలిస్తే వారే కిరీట ధారణ చేస్తారు. అయితే ప్రజలకు ఇటీవల కాలంలో ఒక పార్టీ మీద విపరీతమైన ప్రేమ మరో పార్టీ మీద అతి వ్యతిరేకత వస్తున్నాయా అన్నదే చర్చగా ఉంది.

ఆ విధంగా జరిగితే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ఎంత వరకూ మేలు చేస్తుంది అన్న ధర్మ సందేహాలూ మేధావుల నుంచి ఎదురవుతున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షమూ ప్రతిపక్షమూ ఉండాలి. ఈ రెండూ ఒక బండికి చక్రాల మాదిరిగా ఉంటేనే ఆ రధం సాఫీగా సాగుతుంది. కానీ చూడబోతే రాను రానూ ఒక చక్రమే అతి పెద్దగా ఉంటోంది. మరో చక్రం చిన్నగా మారి వామన అవతారం ఎత్తుతుంది.

దీంతో అధికార పక్షమే అంతటా కనిపిస్తోంది. విపక్షం అన్నది తగ్గిపోతోంది. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో కూడా విపక్షం అన్నది లేదు, విపక్ష హోదాకు కావాల్సిన 54 సీట్లు కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీ సాధించకపోవడంలో ప్రతిపక్షం లేకుండానే రెండు సభలు ముగిసాయి. 2024లో మాత్రం కాంగ్రెస్ వంద దాకా సీట్లు సాధించింది. దాంతో విపక్ష హోదా ఇచ్చారు.

ఇక ఢిల్లీలో కూడా గతంలో విపక్షానికి చోటు దక్కలేదు. అంతటి అంతులేని అభిమానం కేజ్రీవాల్ చీపురు పార్టీ మీద చూపించారు. ఇపుడు చూస్తే దేశంలో చాలా ప్రధాన రాష్ట్రాలలో విపక్షం అన్నది లేకుండా పోతోంది. ఆరు నెలల క్రితం ఏపీలో విపక్షం అన్నది లేకుండా నూటికి 95 శాతం పైగా ఓట్లూ సీట్లూ టీడీపీ కూటమికి కట్టబెట్టారు

దాంతో కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న వైసీపీ తామే అసలైన ప్రతిపక్షం కాబట్టి తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది. దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తోంది. ఇంతలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ చూసినా విపక్ష హోదా అన్నది ఏ పక్షానికి దక్కని పరిస్థితి. ఉద్ధవ్ థాక్రే శివసేనకు 20 సీట్లు వస్తే కాంగ్రెస్ కి 16, శరద్ పవార్ ఎన్సీపీ కి 10 సీట్లు లభించాయి. దీంతో 30 సీట్లు ఉంటేనే తప్ప విపక్ష హోదా దక్కే సీన్ లేదు కాబట్టి ప్రతిపక్షం లేనట్లే అని అంటున్నారు.

ఈ రెండు రాష్ట్రాలే కాదు జాతీయ స్థాయిలో చూస్తే ఒక్కసారి చూస్తే కనుక గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం లలో కూడా ప్రతిపక్షం అన్నది లేదు. అంతటా అధికార పక్షం హవానే సాగిపోతోంది. రానున్న రోజులలో ఇదే రకమైన ల్యాండ్ స్లైడ్ విక్టరీలు పార్టీలకు దక్కితే విపక్షం అన్నది ఎక్కడా ఉండే చాన్స్ లేదు.

కేవలం అధికార పక్షమే అన్నింటా కనిపిస్తుంటుంది. అయితే ఇది ఎంతవరకూ మంచి పరిణామం అని అంతా ఆలోచిస్తున్నారు. ప్రజల సమస్యలు చాటేది ప్రతిపక్షమే. అధికార పక్షానికి అవసరానికి సరిపడా మెజారిటీని ఇస్తూనే బలమైన విపక్షాన్ని కూడా గెలిపించి చట్టసభలకు పంపించాలని అంటున్నారు.

ఆ విధంగా విలక్షణమైన తీర్పు ఇస్తేనే అపుడు ప్రజా స్వామ్యం మరింత పదిలంగా ఉంటుందని, అధికార పక్షానికి ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బాలెన్స్ గా విపక్షాలు యాక్ట్ చేసేందుకు వీలు ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరి రానున్న రోజులలో ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం విపక్ష పాత్రధారులు కనుమరుగు కావాల్సిందే అని అంటున్నారు

Tags:    

Similar News