లిఫ్ట్ రాలేదు.. డోర్ ఓపెన్ అయ్యింది.. హైదరాబాద్ లో వ్యక్తి మృతి
భవన నిర్మాణాల్లో చోటు చేసుకున్న మార్పుల పుణ్యమా అని.. లిఫ్ట్ వినియోగం అంతకంతకూ ఎక్కువ అయిపోవటం తెలిసిందే.
భవన నిర్మాణాల్లో చోటు చేసుకున్న మార్పుల పుణ్యమా అని.. లిఫ్ట్ వినియోగం అంతకంతకూ ఎక్కువ అయిపోవటం తెలిసిందే. కొద్దిపాటి స్థలంలో పెద్ద ఎత్తున అంతస్తులు వేసేస్తున్న వేళ.. లిఫ్ట్ ఖాయంగా పెట్టేస్తున్నారు. అయితే.. కొన్ని లిఫ్ట్ లు సరిగా పని చేయని కారణంగా ప్రాణాలు పోతున్న దుస్థితి. అలాంటి విషాద ఘటన తాజాగా హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో చోటు చేసుకుంది. లిఫ్ట్ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి.
మెహదీపట్నంలోని ప్రియా కాలనీ గుడిమల్కాపూర్ లోని వకాస్ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అయ్యింది. దీంతో.. లిఫ్ట్ గుంటలో పడి వ్యక్తి చనిపోయాడు. సదరు అపార్ట్ మెంట్ లో 55 ఏళ్ల సమీ ఉల్లా బేగ్ నివసిస్తున్నారు. ఆదివారం బయటకు వెళ్లే క్రమంలో లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశారు.
అయితే.. లిప్టు రాలేదు కానీ.. డోర్ మాత్రం ఓపెన్ అయ్యింది. ఎప్పటిలానే లిఫ్ట్ వచ్చాకే డోర్ ఓపెన్ అవుతుందన్న భావనతో ఆయన అడుగు లోపలకు వేశారు. అంతే.. పై నుంచి (నాలుగో అంతస్తు) కిందకు (లిఫ్ట్ గుంతలో)పడిపోవటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే స్పందించిన అపార్ట్ మెంట్ వాసులు.. కుటుంబ సభ్యులు బేగ్ ను లిఫ్ట్ గుంత నుంచి బయటకు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో.. సదరు కుటుంబం శోక సంద్రంలోకి కూరుకుపోయింది.