మహిళల ఫోన్లు రికార్డు చేస్తారా? ఎస్పీ ఇది కరెక్ట్ కాదు : పేర్ని నాని వార్నింగ్

ఈ కేసు ఎఫెక్టో ఏమో గానీ కొంతకాలంగా పేర్ని రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడు ప్రతిపక్షం తరపున మాటల టపాసులు పేల్చే పేర్ని మౌనం దాల్చడం అనేక చర్చలకు దారితీసింది.

Update: 2025-02-21 13:49 GMT

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేసి సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఆరోపించారు. క్రిష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే పోలీసులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు. తాను ఫోన్ ట్యాపింగులకు భయపడే వ్యక్తిని కానని తెగేసి చెప్పారు.

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానిపై బియ్యం అక్రమ తరలింపు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నానితో పాటు ఆయన భార్య కూడా నిందితులుగా పేర్కొనగా, పేర్ని భార్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పేర్ని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతున్నందున, తీర్పు వచ్చేవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ కోర్టు పోలీసులకు సూచించింది.

ఈ కేసు ఎఫెక్టో ఏమో గానీ కొంతకాలంగా పేర్ని రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడు ప్రతిపక్షం తరపున మాటల టపాసులు పేల్చే పేర్ని మౌనం దాల్చడం అనేక చర్చలకు దారితీసింది. ఇక వంశీ అరెస్టు తర్వాత అధినేత జగన్ తో కలిసి జైలుకు వచ్చిన ఆయనకు ఆ రోజు ములాఖత్ అయ్యే అవకాశం రాలేదు. ఆ మరునాడు మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనకు వెళ్లారు. అయితే పేర్ని గుంటూరు వెళ్లకపోయినా, ఆయన వెళ్లినట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా డీజీపీకి లేఖ రాశారు పేర్ని, కాగా, ఈ రోజు విజయవాడ జైల్లో వంశీతో ములాఖత్ అయిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

క్రిష్ణా జిల్లా పోలీసులు తనతోపాటు వైసీపీ నేతలు, వారి భార్యల పోన్లను రికార్డు చేస్తున్నట్లు పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ రమేశ్ ఆస్పత్రి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 17 మంది కానిస్టేబుళ్లను వాడుతున్నారని, కానిస్టేబుళ్లకు జీతాలు కాకుండా నెలకు అదనంగా లక్ష రూపాయల నగదు ఇస్తున్నారని ఆరోపించారు.

మచిలీపట్నంలోని కార్పొరేటర్లు, గ్రామీణ ప్రాంతానికి చెందిన వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వారి భార్యల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారని, అందరి సంభాషణలు వింటూ ఎవరైనా వైసీపీ పార్టీ తరఫున పనిచేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాంపింగ్ నేరమని, ఈ వ్యవహారంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తగిన ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News