ఎంఏ పొలిటికల్ సైన్స్, చెప్పులు కుట్టుకుంటూ... పిఠాపురంలో ఆసక్తికర నామినేషన్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

Update: 2024-04-26 10:38 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీలక పరిణామాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా పలువురి అభ్యర్థుల ఆస్తులు, అప్పులు ఒక టాపిక్ అయితే... మరికొంతమందిపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్య మరో చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ప్రధానంగా పిఠాపురంలో దాఖలైన ఒక నామినేషన్ ఆసక్తికరంగా మారింది.


అవును... ప్రస్తుతం ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో దాఖలైన ఒక పిటిషన్ ఆసక్తికరంగా ఉంది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా హాట్ టాపిక్ అనే చెప్పాలి. కారణం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనే అనాలి! అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, వెస్ట్ గోదావరి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన రెండుచోట్లా ఒటమి పాలైన పవన్ కల్యాణ్.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కంకణం కట్టుకున్నారు. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... తన వద్ద మొత్తం 20,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని చూపిస్తూ.. ఒక అభ్యర్థి పిఠాపురంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఈయన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాజాగా సమర్పించిన అఫిడవిట్ లో తనవద్ద చేతిలో రూ.20వేలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. దీంతో... ఈయన నామినేషన్ ఆసక్తికరంగా మారింది.

పిఠాపురంలోని స్థానిక సీత‌య్యగారి తోట‌కు చెందిన ఏడిద భాస్కర‌రావు.. రెండు ద‌శాబ్దాలుగా చెప్పులు కుట్టుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ఇంటర్మీడియట్ వ‌రకు రెగ్యుల‌ర్‌ గా చ‌దివిన ఆయన.. త‌ర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా పొలిటిక‌ల్ సైన్స్‌ లో పీజీ చేశారు. ఈ క్రమంలో ఈ ఎన్నిక‌ల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్‌ గా నామినేష‌న్ వేశారు. త‌న ఆస్తులు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉన్నాయ‌ని, చేతిలో రూ.20 వేలు మాత్రమే ఉన్నాయ‌ని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ కొనసాగాలాని చాలామంది కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హ‌క్కును ఆయ‌న సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారంటూ పలువురు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా ప్రచారం చేసుకోవ‌డం లేదు కానీ... త‌న‌ను క‌లిసి మీడియాకు మాత్రం ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. త‌న‌ను గెలిపిస్తే.. ప్రజ‌ల‌కు సేవ చేస్తాన‌ని చెబుతున్నారు.

కాగా.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పిఠాపురంలో మొత్తం 35 నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండగా.. అధికార పార్టీ నుంచి వంగ గీత బరిలోకి దిగుతున్నారు!

Tags:    

Similar News