ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-11-11 09:35 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ అయ్యాయి. జూబ్లిహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల కీలక నేతలవే కాకుండా.. చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అటు కొంత మంది సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా ట్యాప్ చేసి ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారు. చాలా మంది లీడర్లను కేసుల్లో ఇరికించారు.

దీనిపై పీసీసీ చీఫ్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వదలపెట్టబోమని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వచ్చీరాగానే ఫోన్ ట్యాపింగ్ అంశంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగుతో సంబంధాలున్న పోలీసులను విచారించారు. పలువురిని జైలుకు కూడా తరలించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో ముందుగా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఆయనను విచారించగా.. పలు కీలక అంశాలను వెల్లడించారు. వాటి ఆధారంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎస్ఐబీ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావుతోపాటు శ్రవణ్ రావుపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచే అమెరికాకు పారిపోయారు. దీంతో ఇంకా ఆయనను రప్పించి విచారించాల్సి ఉంది. అలాగే.. శ్రవణ్ రావు కూడా అమెరికాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ అయ్యాయి. జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఏసీపీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతన్నకు లింగయ్య ఫోన్లు చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై లోతుగా విచారించేందుకు పోలీసులు లింగయ్యను పిలిచారు.

Tags:    

Similar News