అందరూ ఆదినారాయణరెడ్డినే టార్గెట్ చేశారా? దేవగుడి రెడ్డికి కలిసిరాని కాలం...

ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి ఏ ముహూర్తాన గెలిచిరో కానీ, ఈ దఫా ఆయనకు కాలం కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

Update: 2025-02-04 07:35 GMT

కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఎప్పుడూ కాకమీదే ఉంటాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయానికి చిరునామాగా నిలిచిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ ఛాయలు లేకపోయనా, పాలిటిక్స్ లో వేడి మాత్రం అంతకుమించి అన్నట్లే సాగుతోంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి ఏ ముహూర్తాన గెలిచిరో కానీ, ఈ దఫా ఆయనకు కాలం కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటైన జమ్మలమడుగు నియోజకవర్గం 2004 నుంచి ఆదినారాయణరెడ్డి అడ్డాగా మారింది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐదు ఎన్నికల్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆదినారాయణరెడ్డి. అయితే నాలుగోసారి గెలిచిన తర్వాత ఆయనకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డిని అంతా దేవగుడి రెడ్డి అంటారు. దేవగుడి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం. ఒకప్పుడు ఆ గ్రామానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. దీంతో ఆదినారాయణరెడ్డి అంతా ఊరిపేరుతోనే పిలుస్తుంటారు. 2019లో తప్ప పరాజయం అంటే ఏంటో ఎరుగని ఆదినారాయణరెడ్డి ఈ సారి ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న పక్క జిల్లాకు చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫ్లైయాష్ తరలింపుపై యాగీ చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన జేసీ.. జమ్మలమడుగులో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి బూడిద తరలించుకుపోవడాన్ని ఎమ్మెల్యే ఆది వర్గీయులు అడ్డుకున్నారు. దీనికి జేసీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

చంద్రబాబు గత ప్రభుత్వంలో కూడా తామే బూడిద తరలించామని, ఇప్పుడు అదే పని చేస్తామని మొండికేశారు జేసీ. ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి అంతకుముందు టీడీపీ, దానికన్నా ముందు వైసీపీలో ఉండేవారు. ఆయన వైసీపీలో ఉండగా, ఫ్లైయాష్ తరలింపును ప్రారంభించారు జేసీ.. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వచ్చినా జేసీదే హవా సాగింది. దీంతో ఇప్పుడు కూడా ఆయనకే వదిలేయాని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో వెనక్కి తగ్గారట ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం లేకపోవడంతో తన అనుచరులకు సర్దిచెప్పి ఇంకో పని చేసుకుందామని సముదాయించుకోవాల్సివచ్చిందని అంటున్నారు. ఈ వివాదం ఇలా సమసిందని అనుకుంటుండగా, తాజాగా మరో అంశంలోనూ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.

జమ్మలమడుగు క్లబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తక్షణం క్లబ్ ను సీజ్ చేయాలని జిల్లా ఎస్పీకి ఓ లేఖ అందింది. ఈ లేఖ బీజేపీకే చెందిన ఎంపీ సీఎం రమేశ్ రాయడం రాజకీయం రచ్చకు దారితీస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్న క్లబ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎంపీ సీఎం రమేశ్ లేఖ రాయడం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేతో మాటమాత్రమైనా చెప్పకుండా ఇలా అధికారులకు లేఖ రాయడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిపతి పోయినట్లైందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్లబ్ ను ఎమ్మెల్యేకు సమీప బంధువైన దేవగుడి నాగేశ్వర్ రెడ్డి నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఆదానీ కంపెనీ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కాంట్రాక్టు విషయంలోనూ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలు పొడసూపాయని అంటున్నారు. తమకు సబ్ కాంట్రాక్టులివ్వాలని ఎమ్మెల్యే అనుచరులు కంపెనీ ప్రతినిధులను బెదిరించారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ విషయంలోనూ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే వెనక్కు తగ్గాల్సివచ్చిందని అంటున్నారు. ఇలా నాలుగోసారి గెలిచిన నుంచి ఎమ్మెల్యేకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోందని చెబుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఎమ్మెల్యే ఆది తన అనుచరుల వద్ద తల ఎత్తుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News