టీడీపీ ఆరు గ్యారెంటీలకూ జనసేన కలిపే నాలుగు హామీలూ ఇవే?

ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉందని వార్తలొస్తున్నప్పటికీ ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి

Update: 2023-10-25 06:21 GMT

ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉందని వార్తలొస్తున్నప్పటికీ ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతరం పవన్ కల్యాణ్ ప్రకటించిన టీడీపీతో జనసేన పొత్తు కీలకమైందనే చెప్పాలి. వైసీపీ నేతల దృష్టిలో ఇదేమీ కొత్త విషయం కానప్పటికీ.. ఎన్డీఏ లో భాగస్వామిగా ఉంటున్న జనసేన ఇలా టీడీపీతో పొత్తు ప్రకటించడం కచ్చితంగా ప్రత్యేకమైనదే అని అంటున్నారు పరిశీలకులు.

ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు తర్వాత ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ రాజమండ్రిలో తొలి సమావేశం ఏర్పాటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కారక్రమాన్ని పాడుతా తీయగా షో సెలక్షన్స్ అని వైసీపీ నేతలు ఎద్దేవా చేసిన సంగతి కాసెపు పక్కనపెడితే... ఈ సమావేశంలో అత్యంత కీలకంగా ఉమ్మడి మ్యానిఫెస్టోపై క్లారిటీ వచ్చింది. అందులో భాగంగా... నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.

దీంతో ఇప్పుడు ఈ విషయం మీద ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. కారణం ఇప్పటికే 6 అంశాలతో రాజమండ్రిలో జరిగిన మహానాడులో మినీ మానిఫెస్టోను ప్రకటించింది టీడీపీ. ఇదే సమయంలో జనసేన కూడా మేనిఫెస్టోపై ఒక క్లారిటీకి వచ్చిందని చెబుతున్నారు! దీంతో... ఇప్పుడు వీటిలో ఏయే అంశాలను మిక్స్ చేసి మేనిఫెస్టో రెడీ చేస్తారు అనేది మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే... మహానాడులో టీడీపీ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించింది కాబట్టి.. వాటికి తోడు జనసేన నుంచి మరో నాలుగు గ్యారెంటీలు కలిపి.. రౌండ్ ఫిగర్ 10 గ్యారెంటీ పథకాలతో మినీ మేనిఫెస్టోను రూపిందించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా అత్యంత కీలకంగా 10 గ్యారెంటీ పథకాలతో ఒక మినీ మేనిఫెస్టోని సిద్ధం చేయాలని, దాన్ని నవంబర్ 1 న విడుదల చేయాలని ఇరు పార్టీలు ఫిక్స్ అయ్యాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ ప్రతిపాదించే నాలుగు గ్యారంటీలలో... భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఒక కీలక హామీతో పాటు రైతులకు మరో హామీ, యువతకు తెలంగాణలోని దళితబంధు తరహాలో ఒక హామీ, సబ్ ప్లాన్ నిధుల అంశం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

అనంతరం అనంతరం నవంబర్ 1 నుంచే 100 నుంచి 120 రోజుల పాటు ఈ మ్యానిఫెస్టో హామీల్ని జనంలోకి తీసుకెళ్లాలని.. అందుకు వీలుగా ఇరు పార్టీల నాయకులు, క్యాడర్ ఇంటింటికీ వెళ్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీకి ప్రజలకూ ఎలాంటి గ్యాప్ రాకుండా రాష్ట్ర స్ధాయితో పాటు క్షేత్రస్థాయిలోనూ ఇరుపార్టీల నేతలతో రెగ్యులర్ గా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు.

అయితే ఎన్నికల నోటిఫికేషన్ తేదీని బట్టి మెయిన్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తుంది. ఈలోపు చంద్రబాబు జైలు నుంచి విడుదల అయితే... పూర్తిస్ధాయిలో ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోను ఆయన చేతులమీదుగా విడుదల చేస్తారని సమాచారం. అయితే గతంలోలా పేజీలకు పేజీలు పుస్తకాలు వేయకుండా.. వందల సంఖ్యలో హామీలు అచ్చేయకుండా.. వీలైనంత సింపుల్ గా ఈసారి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

ఏది ఏమైనా... టీడీపీ - జనసేనల పొత్తు ప్రకటన అనంతరం రాబోతున్న ఈ కీలక మేనిఫెస్టో నవంబర్ 1 న ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందనేది వేచి చూడాలి. ఆ సంగతి అలా ఉంటే... ఈ సారి టీడీపీ - జనసేనలు 175 సీట్లకు గానూ 160 సీట్లలో గెలవాలనే లక్ష్యం "టార్గెట్ 160" తో ముందుకు వెళ్తున్నాయని కథనాలొస్తున్నాయి. అంటే... గడిచిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 151 కంటే 9 ఎక్కువన్నమాట!

Tags:    

Similar News