ప్రపంచంలోనే కాస్టీల్లి ఎన్నికలు మనవే.. ఎంత ఖర్చో తెలుసా?
ఈ రూ.1.35 లక్షల కోట్ల వ్యయంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఖర్చులు ఇమిడి ఉన్నాయని పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సంఖ్యలో దాదాపు 96.6 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. దీంతో మనదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్ లో ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడానికి ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
కాగా మనదేశంలో చిన్నచితకా, పెద్దవి కలిపి వందలాది పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల నిర్వహణ ఖర్చు తడిసిమోపిడవుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి ఈ వ్యయం రెట్టింపు అవుతోంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచి రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోల ఖర్చు, ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులు, ప్రచార వాహనాలు, ప్రచార సామగ్రి ఇలా అనేక రకాల ఖర్చులు ఉంటాయి.
మనదేశంలో ఎన్నికల నిర్వహణ చాలా సుదీర్ఘ ప్రక్రియ. ఇందుకు తగ్గట్టే ఎన్నికల ఖర్చు కూడా చాలా భారీగా ఉంటుంది. ఈసారి మనదేశంలో ఎన్నికల ఖర్చు 1.35 లక్షల కోట్లని ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ వెల్లడించింది. ఈ రూ.1.35 లక్షల కోట్ల వ్యయంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వాలు, అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఖర్చులు ఇమిడి ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల తేదీల ప్రకటనకు 3–4 నెలల ముందు నుంచి చేసిన ఖర్చులను కూడా ఇందులో లెక్కించామని వివరించింది.
కాగా 2019లో ఎన్నికల వ్యయం రూ.60 వేలకోట్లని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. దానితో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల వ్యయం రెట్టింపు అయ్యిందని వెల్లడించింది. 2019లో రూ.60 వేల కోట్ల వ్యయంలో 45 శాతం బీజేపీదేనని పేర్కొంది.
దీంతో ప్రపంచంలోనే ఎన్నికల వ్యయం అత్యధికంగా గల దేశంగా భారత్ రికార్డులకెక్కుతుందని పేర్కొంది. గత 35 ఏళ్లుగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను ఈ సంస్థ వెల్లడిస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దేశంలో మొత్తం 96.6 కోట్లు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంటే ఒక్కో ఓటరుకు రూ.1400 వ్యయం అవుతుందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ కు చైర్మన్ ఎన్. భాస్కరరావు తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఖర్చు ఉంటుందని వివరించారు.
మొదట తాము ఎన్నికల ఖర్చును రూ. 1.20 లక్ష కోట్లుగా అంచనా వేశామని భాస్కరరావు వెల్లడించారు. అయితే ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడి కావడంతో ఎన్నికల సంబంధిత ఖర్చుల్ని లెక్కించాక ఈ మొత్తం వ్యయాన్ని రూ. 1.35 లక్షల కోట్లకు పెంచామని ఆయన వివరించారు.