పోసాని ఆవేశం...కావేశం...కారాగార వాసం !

పోసాని ఆవేశ కావేశాలే ఈ రోజున ఆయనను కారాగారవాసానికి గురి చేశాయని అంటున్నారు. ఆయన సతీమణీ చెప్పినట్లుగానే పోసాని ఊరకే ఎవరినీ అనరు.;

Update: 2025-02-28 03:54 GMT

దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చి మెరుపులా మెరిసారు. తనదైన శైలిలో చురుక్కుమనిపించే డైలాగులతో తూటాలనే పేల్చారు. ఆయన కధ మాటలు అన్నీ ఆలోచింపచేసేవే. సమాజాన్ని ప్రశ్నించేవే. స్త్రీ పక్ష పాతిగా ఆయన అలాగే అభ్యుదయవాదిగా ఆయన మాటలు కనిపిస్తాయి. ఆయనే పోసాని క్రిష్ణ మురళి.

మంచి టాలెంట్ ఉన్న వారుగా చెప్పుకోవాలి. ఆయన సినీ సీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోసాని మంచి నటుడు కూడా. అలాగే మంచి వారుగా పేరు ఉంది. అయితే ఆయనలో ఆవేశం పాళ్ళు హెచ్చు. మాట పడరు. అలాగే తనను ఎవరైనా అకారణంగా అంటే దానికి రెట్టింపు ఇచ్చేవరకూ ఊరుకునే నైజం కాదు.

అందుకే ఆయన ప్రతిభకు తగినట్లుగా వెల్లువలా అవకాశాలు రాలేదనే అంటారు. ఎక్కడా రాజీ పడని మనస్తత్వం ఆయనది. అంతే కాదు తాను నమ్మిన దానికి నూరు శాతం కమిట్మెంట్ లో ఉంటారు. ఇక పోసాని క్రిష్ణ మురళి గతంలో వైసీపీ వైపున ఉంటూ ప్రత్యర్ధులను పదునైన విమర్శలతో చేసిన వాటి మీద ఈ రోజులు అవి కేసులుగా మారి ఇబ్బంది పెడుతున్నాయి.

పోసాని ఆవేశ కావేశాలే ఈ రోజున ఆయనను కారాగారవాసానికి గురి చేశాయని అంటున్నారు. ఆయన సతీమణీ చెప్పినట్లుగానే పోసాని ఊరకే ఎవరినీ అనరు. తనను ఎవరైనా అంటే ఊరుకోరు. ఆ సమయంలో వచ్చే ఆవేశంలో ఆయన ఏమి మాట్లాడుతారో తెలియదు అని కూడా అంటారు. అదే విధంగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలే ఇపుడు అరెస్టు దాకా తెచ్చాయని అంటున్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం తిరుగుతున్న ఆ పాత వీడియో క్లిప్స్ చూస్తే కనుక పోసాని ఎంతలా నోరు జారారో అర్ధం అవుతుంది. తన కుటుంబాన్ని సోషల్ మీడియా ద్వారా వేధించారని నానా మాటలు అంటున్నారని ట్రోల్స్ చేస్తున్నారని పోసానికి ఆవేశం ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆయన నేరుగా జనసేన అధినేత మీద విరుచుకుపడడమే ఈ రోజు ఈ స్థితికి తెచ్చిందని అంటున్నారు.

నిజానికి పవన్ అయినా జగన్ అయినా చంద్రబాబు లోకేష్ అయినా సోషల్ మీడియాలో ఆయా పార్టీల అభిమానులు యాక్టివిస్టులను ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఎవరో ఉన్మాదులుగా మారి పెట్టే పోస్టింగులకు అధినాయకులకు సంబంధం ఏమిటి అన్నది కూడా ఆలోచించుకోవాలి.

పోసాని ఇక్కడే తెగ ఆవేశపడిపోయారని అంటున్నారు. జనసేన పేరుతో ఎవరో ట్రోల్స్ చేస్తే ఆయన పవన్ ఫ్యామిలీ మీద నేరుగా దాడి చేయడం అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అలా కాకుండా ఆయన సైబర్ క్రైం కింద కేసు కట్టించి అలా ట్రోల్ చేసిన వారిలో కొందరిని అయినా పట్టుకుని అరెస్టు చేయించి ఉంటే వేరేలా కధ ఉండేదని అంటున్నారు.

మొత్తానికి పోసాని కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యల్తో నిందించడం అన్నది కూడా ఇక్కడ జరిగింది అన్నది మరచిపోరాదు. అయితే అదే సమయంలో ఆయన బాధితుడుగా ఉన్నారు. కానీ ఆయన అతి ఆవేశం ఆగ్రహమే మంటలుగా మారి ఈ తంటాను తెచ్చింది. ప్రస్తుతం పద్నాలుగు రోజుల రిమాండ్ కి అన్నమయ్య జిల్లా కోర్టు ఆయనకు విధించింది. ఏది ఏమైనా పోసాని ఎపిసోడ్ తీవ్ర ఆగ్రహావేశాలతో నోరు ఉంది కదా అని మీడియా ముందుకు వచ్చి వాచాలత్వం ప్రదర్శించే వారికి ఒక గుణపాఠమే అని అంటున్నారు.

Tags:    

Similar News