పవన్ విషయంలో చంద్రబాబుకు మహేష్ ప్రశ్నలు!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ భారీ విక్టరీ టీంకి కెప్టెన్ చంద్రబాబు అయితే.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం పవన్ కల్యాణ్ దే అనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి. ఈ సమయంలో వైసీపీ నేత పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును.. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో జనసేనాని కీలక భూమిక పోషించారనేది అంతా చెబుతున్నమాట. ఇదే విషయాన్ని పలువురు వైసీపీ నేతలు ఆన్ ద రికార్డ్, ఆఫ్ ద రికార్డ్ చెబుతున్న పరిస్థితి. ఇందులో భాగంగా... కూటమి విజయంలో పవన్ దే కీలక భూమిక అని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించారు. అందువల్లే పవన్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ దక్కిందనే కామెంట్లూ వినిపించాయి!
ఇదే సమయంలో పవన్ కు మాత్రమే డిప్యూటీ సీఎం ఇవ్వడంపై పోతిన మహేష్ రియాక్ట్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్... పవన్ కల్యాణ్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ.. పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా... మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని మొదలుపెట్టిన మహేష్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలను అవమానపరిచారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ.. 10 మందికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని.. ఆయన తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ, బీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చి, ఆ సామాజికవర్గాల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. ఈ క్రమంగా సోషల్ ఇంజినీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు.
అయితే చంద్రబాబు మాత్రం అంతకంటే మిన్నగా చేయకుండా... ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని.. ఫలితంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లింలను అవమానించారని పోతిన మహేష్ విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది.