మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా !
బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వాలంటే ప్రియాంకా గాంధీ ఉండాల్సిందే అన్న మాట కాంగ్రెస్ తో పాటు బయట పక్షాలలోనూ ఉంది
గాంధీ కుటుంబంలో నవతరం వారసులుగా రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఉన్నారు. ఈ ఇద్దరిలో ప్రియాంకా గాంధీ దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని పేరు. ఆమె తన నాన్నమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంటారు. అంతే కాదు ఆమె ప్రసంగాలు సైతం పదును తేరి ఉంటాయి. బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వాలంటే ప్రియాంకా గాంధీ ఉండాల్సిందే అన్న మాట కాంగ్రెస్ తో పాటు బయట పక్షాలలోనూ ఉంది.
ఇదిలా ఉంటే తన రాజకీయ జీవితం గురించి భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ గురించి తాజాగా ప్రియాంకా గాంధీ ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద సునిశిత విమర్శలు చేశారు. అమేధీ రాయబరేలీ నుంచి గాంధీ కుటుంబం పారిపోతోంది అన్న ప్రధాని విమర్శలకు ఆమె జవాబు చెబుతూ 2014 లో గుజరాత్ లోని వడోదరా నుంచి పోటీ చేసి గెలిచిన మోడీ ఆ తరువాత ఆ సీటుని ఎందుకు వదిలేశారు అని ప్రియాంకా గాంధీ సూటిగానే ప్రశ్నించారు.
ఆ సీటులో గెలవమని భయమా లేక పారిపోవడం గానే దాన్ని చూడాలా అని ఆమె మోడీని ప్రశ్నించారు. అమేధీ రాయబరేలీ రెండు సీట్లతో గాంధీ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఈ సీట్లను తమ కుటుంబం ఎపుడూ వదులుకోదు ఎక్కడికీ పారిపోదు అని ఆమె అన్నారు. తాము ఎప్పటికీ కంటికి రెప్పలా ఈ సీట్లను కాపాడుకుంటామని ఆమె చెప్పారు.
తాను ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అన్న దానికి ఆమె వివరణ ఇచ్చారు. పోటీ చేస్తే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పూర్తిగా సమయం సరిపోదు. నియోజకవర్గానికే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అది బీజేపీకే రాజకీయంగా లబ్దిని చేకూరుస్తుంది. అందుకే తాను ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నానని ఈసారి కాంగ్రెస్ ప్రచారానికే పరిమితం అయ్యానని చెప్పారు.
భవిష్యత్తులో తాను పోటీ చేస్తానా లేదా అన్నది పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. పార్టీ ఆదేశిస్తే ప్రజలు అలా కోరుకుంటే తాను తప్పకుండా పోటీ చేస్తాను అని ఆమె అన్నారు. దీనిని బట్టి ప్రియాంకా గాంధీ రానున్న కాలంలో ఎంపీగా చట్టసభలలో అడుగుపెడతాను అని చెప్పకనే చెప్పేశారు అన్న మాట.
ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రచారం చేయడం మీదనే తన దృష్టి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆమె అన్నారు. మొత్తం మీద చూస్తే ప్రియాంకా గాంధీ పూర్తి క్లారిటీతో ఉన్నారని అర్థం అవుతోంది. అదే సమయంలో ఆమె తన ఎన్నికల రాజకీయానికి తెర తీసేది ఎపుడు అన్నది కూడా ఆమెకే తెలుసు అంటున్నారు.