బీజేపీలో చిన్నమ్మ కంటే ఎవరూ లేరా ?

బీజేపీలో చిన్నమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి రెండేళ్ల అధ్యక్ష పాలన మరి కొద్ది నెలలలో ముగియనుంది.

Update: 2025-01-03 03:32 GMT

బీజేపీలో చిన్నమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి రెండేళ్ల అధ్యక్ష పాలన మరి కొద్ది నెలలలో ముగియనుంది. ఆమెను ఈ గడువు కంటే ముందు తప్పించాలని ఆమె వ్యతిరేక వర్గం గట్టి పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఈ వ్యతిరేక జనం అంతా కలసి ఢిల్లీకి వెళ్ళి లాబీయింగ్ చేస్తున్నారు అని అంటున్నారు.

ఆమె వల్ల పార్టీకి ఏమీ ఒనగూడలేదని ఆమె పార్టీని బలోపేతం చేయడంలేదని చెబుతూ తమకు వీలుంటే చాన్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారుట. తమ సామాజిక రాజకీయ ఆర్ధిక పలుకుబడిని కూడా చూపిస్తూ ఒక్క చాన్స్ అని వారు రిక్వెస్ట్ మీద రిక్వెస్టులు పెడుతున్నారుట.

అయితే బీజేపీ పెద్దల దృష్టిలో ఎవరు ఉన్నారో తెలియదు, అంతే కాదు వారు ఏపీలో నాయకత్వాన్ని మార్చాలని కూడా భావిస్తున్నారో లేదో కూడా తెలియదు కానీ ఢిల్లీకి వెళ్తున్న సీనియర్ నేతలు చాలా మంది తాము పార్టీలో మొదటి నుంచి ఉంటున్నామని ఇస్తే గిస్తే తమకే అద్యక్ష పీఠం ఇవ్వాలని కోరుతున్నారుట.

ఇక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు ఇస్తే ఒక బలమైన సామాజిక వర్గం రాయలసీమ రీజియన్ లో పార్టీ వైపు తిరుగుతుందని కూడా అంటున్నారుట. అయితే కండువా కప్పుకున్నారు అన్న మాటే కానీ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పెద్దగా కనిపించడం లేదు అన్న మాటని కూడా మరికొందరు చెబుతున్నారుట.

ఇక విష్ణు కుమార్ రాజు విశాఖ బీజేపీ ఎమ్మెల్యే కూడా వీలైతే తనకూ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. ఆయన ఇటీవల చాలా ఇష్యూస్ మీద ఓపెన్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇదంతా మీడియా అటెన్షన్ కోసమే అని అంటున్నారు. దాంతో విష్ణుకు ఈ పదవి ఇస్తారా లేదా అన్నది కూడా చర్చగానే ఉంది.

ఇవన్నీ ఇలా ఉంటే పురంధేశ్వరిని ఈ పదవి నుంచి తప్పించేస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇపుడిపుడే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండవని అంటున్నారు. ఒకవేళ ఇవ్వాలని చూసినా ఏపీలో ఇప్పటికే ఆమె సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ విధంగా కొంత ఇబ్బంది అవుతోంది అంటున్నారు.

ఆమెను తీసుకుంటే కేంద్ర కార్యవర్గంలోకి చేర్చుకుని ఒక హోదా పార్టీపరంగా కల్పిస్తారు అని అంటున్నారు. అయితే పురందేశ్వరి మాత్రం ఇస్తే కేంద్ర మంత్రి పదవి లేకపోతే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు

మరో వైపు చూస్తే చిన్నమ్మను తప్పిస్తే మరో కొత్త పేరు ఏదీ అధినాయకత్వానికి తోచడం లేదని అంటున్నారు. ఆమె ప్రెసిడెంట్ గా ఉన్నపుడే ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను రాబట్టిందని అందువల్ల ఆమెని మరో టెర్మ్ కంటిన్యూ చేస్తే తప్పేంటి అన్న చర్చ కూడా ఆమె వర్గంలో ఉంది. హై కమాండ్ కూడా అలాగే ఆలోచిస్తోంది అంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు అనవసరంగా ఆమెని తప్పించి ఎందుకు కొత్త రాజకీయం చేయడం అని అంటున్నారు. ఏది ఏమైనా చిన్నమ్మకే మరోసారి పార్టీ పగ్గాలు అందుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News