పుతిన్ పై హత్యాయత్నం? ఏం చేశారంటే?

మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రత సర్వీస్ (FSB) ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల 29న మొదట ఒక పేలుడు సంభవించింది.;

Update: 2025-03-31 09:48 GMT
పుతిన్ పై హత్యాయత్నం? ఏం చేశారంటే?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఉపయోగించే ఒక అత్యంత ఖరీదైన లిమోజీన్ కారు మాస్కోలో మంటల్లో కాలిపోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నంగా అనుమానిస్తున్నారు. అధ్యక్ష భవనం ఆస్తుల విభాగం నిర్వహించే ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగా ఉంటుంది. కారు దగ్ధమైన సమయంలో అందులో ఎవరు ఉన్నారనే విషయం తెలియరాలేదు.

మాస్కోలోని లుబ్యంకాలో ఉన్న జాతీయ భద్రత సర్వీస్ (FSB) ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల 29న మొదట ఒక పేలుడు సంభవించింది. ఆ తర్వాత అధ్యక్షుడు తరచుగా ఉపయోగించే ఆరస్ లిమోజీన్ కారులో మంటలు చెలరేగాయి. సమీపంలోని బార్లలో ఉన్నవారు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. వీడియో ఫుటేజ్‌లో ఇంజిన్ భాగం నుండి మంటలు వ్యాపించి కారు మొత్తం కాలిపోతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఈ ఘటనతో రష్యా అధ్యక్షుడి భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల పుతిన్ అనారోగ్యంతో ఉన్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో మరణిస్తారని, ఆ తర్వాత యుద్ధం ముగుస్తుందని ఆయన ఐరోపా జర్నలిస్టులతో అన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఈ కారు దగ్ధం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

పుతిన్ (72) ఈ లిమోజీన్ కారును తరచుగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ఆయన తన సన్నిహితులకు కూడా ఇదే మోడల్‌ను బహుమతిగా ఇస్తుంటారు. ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కూడా పుతిన్ ఈ కారును బహుమతిగా ఇచ్చారు.

పుతిన్ తన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయనకు గౌరవ వందనం చేసే గార్డులను కూడా జాతీయ భద్రత సర్వీస్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతేకాకుండా ఆయన తన సొంత సిబ్బందిని కూడా పూర్తిగా విశ్వసించడం లేదని సమాచారం. ఆయన బయటకు వచ్చినప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ ధరించడం తప్పనిసరి. చెత్త కుండీలు, ఆయన మాట్లాడే ప్రదేశాల సమీపంలోని మురుగునీటి పైపులను కూడా భద్రతా సిబ్బంది నిరంతరం తనిఖీ చేస్తుంటారు. కనిపించే.. కనిపించని భద్రతా సిబ్బంది ఆయనను నిరంతరం కాపాడుతూ ఉంటారు.

ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధ్యక్షుడి కారు దగ్ధం కావడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది నిజంగా హత్యాయత్నమా లేక కేవలం ప్రమాదమా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటన రష్యాలోనూ, అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News