'ఎంపీగారూ బాగున్నారా?' ఎన్నికల్లో గెలిచిన చిరు, బాలయ్యల హీరోయిన్

బెంగాల్ లో ఈసారి సీఎం మమతా బెనర్జీ హవా నడిచింది. ఆమె పార్టీ టీఎంసీ దుమ్మురేపింది

Update: 2024-06-05 12:07 GMT

బెంగాల్ లో ఈసారి సీఎం మమతా బెనర్జీ హవా నడిచింది. ఆమె పార్టీ టీఎంసీ దుమ్మురేపింది. ఒంటరిగానే బరిలో దిగి 29 సీట్లను నెగ్గారు. వాస్తవానికి ఇండి కూటమిలో భాగమైన టీఎంసీ.. కాంగ్రెస్ కు సీట్లు ఇవ్వనుపో అంటూ పోటీ చేశారు. ఈ పరిణామం బీజేపీకి మేలు చేస్తుందేమో అని భయపడినా అదేమీ జరగలేదు. చివరకు దీదీనే సత్తా చాటారు. కాగా, మాజీ టీమిండియా ఆటగాడు యూసుఫ్ పఠాన్ ఎక్కడినుంచో తీసుకొచ్చి బహ్రంపూర్ లో దింపి గెలిపించిన మమతా.. మరో హీరోయిన్ కూ టికెట్ ఇచ్చి ఆమె లోక్ సభకు పంపారు. ఇక టీఎంసీ నుంచే బరిలో ఉన్న మరో మాజీ క్రికెటర్‌, 1983 వన్డే వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యుడైన కృతి ఆజాద్‌ దుర్గాపూర్‌ లోక్ సభ స్థానం నుంచి పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌పై 1.37 లక్షల పైగా మెజారిటీతో గెలుపొందారు. అదే పార్టీకి చెందిన మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు ప్రసూన్‌ బెనర్జీ హౌరాలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ రితిన్ చక్రవర్తిపై 1,69,442 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు.

ఎంపీగారూ..

తెలుగు సినిమాల్లో ఓ దశలో తన అందచందాలతో అలరించిన హీరోయిన్ రచనా బెనర్జీ. మరీ ముఖ్యంగా కన్యాదానం, మావిడాకులు, అభిషేకం వంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. చిరంజీవి సూపర్ హిట్ సినిమా బావగారూ బాగున్నారా?లోనూ ఆమె ఓ కీలక పాత్ర పోషించారు. బాలక్రిష్ణతోనూ సినిమా చేశారు. మొత్తమ్మీద బెంగాలీలోనే 200 సినిమాలు చేశారు రచనా బెనర్జీ. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె టీఎంసీ నుంచి పోటీకి హుగ్లీకి దిగి బీజేపీ ఎంపీ, సినీ నటి అయిన లాకెట్ చటర్జీని 70 వేల ఓట్లతో ఓడించారు.

ఒకప్పుడు మద్యానికి బానిస అయినట్లు రచనా బెనర్జీ మీద కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె అందులోంచి బయటపడ్డారని సమాచారం. రెండు వివాహాలు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొదటి భర్తతో ఏడాదిలోనే రచన విడిపోయినట్లు వికిపీడియా చెబుతోంది.

Tags:    

Similar News