ఒక రోజులో డీమార్ట్ షేరు ధర 9% ఢమాల్ ఎందుకు?

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాలు మదుపర్లను మెప్పించటంలో విఫలం కావటమే షేరు విలువ పడిపోవటానికి కారణంగా చెప్పాలి.

Update: 2024-10-15 04:22 GMT

దేశ వ్యాప్తంగా రిటైల్ వ్యాపారంలో ఒక సంచలనం డిమార్టు. చైన్ సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ షేరు ముందుకే తప్పించి.. వెనక్కి తగ్గదన్న పేరుంది. ఒకవేళ వెనక్కి తగ్గినా.. మళ్లీ ముందుకు వెళ్లేందుకేనన్న సెంటిమెంట్ ఈ షేరు సొంతం చేసుకుంది. అలాంటి డీమార్ట్ షేరు ధర సోమవారం ఒక్కరోజులో 9 శాతం పడిపోవటం ఒక ఎత్తు అయితే.. దీని కారణంగా రోజులో ఆ షేరు మార్కెట్ విలువ పడిపోవటంతో రూ.27వేల కోట్ల భారీ మొత్తం ఆవిరైంది. ఎందుకిలా జరిగింది? డీమార్టు షేరు ఇంతలా పడిపోవటానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాలు మదుపర్లను మెప్పించటంలో విఫలం కావటమే షేరు విలువ పడిపోవటానికి కారణంగా చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై - సెప్టెంబరు త్రైమాసికానికి డీమార్ట్ ఏకీక్రత విలువ ప్రాతిపదికన రూ.659.44 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ నికర లాభం 5 శాతం పెరిగింది. ఆదాయం సైతం 14.41 శాతం పెరిగింది. వీటితో పాటు ఖర్చులు సైతం 14.9 శాతం పెరిగాయి.

ఈ ఫలితాలు మదుపరులను మెప్పించలేదు. దీనికి తోడు.. క్విక్ కామర్స్ సంస్థల నుంచి డీమార్ట్ కు పెరుగుతున్న పోటీ కూడా డీమార్ట్ షేరు తగ్గేందుకు ఒక కారణంగా చెబుతున్నారు. తాజాగా వెలువడిన కంపెనీ ఫలితాల నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్ టార్గెట్ ప్రైస్ లను తగ్గించాయి. ఈ ప్రభావలన్నీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో డీమార్ట్ షేరు విలువ 9.46 శాతం తగ్గేలా చేశాయి. దీంతో షేరు విలువ రూ.4139కు పరిమితమైంది. క్షీణించిన మార్కెట్ విలువ కారణంగా డీమార్ట్ విలువ రూ.2.69 లక్షల కోట్లకు పరిమితమైంది. అసలు ట్విస్టు ఏమంటే.. ఈ రోజు సెన్సెక్స్ 591 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 163 పాయింట్ల లాభంతో ఉండగా.. డీమార్ట్ షేర్ల ధరలు మాత్రం 9.46 శాతం క్షీణించటం గమనార్హం.

Tags:    

Similar News