'గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తుపట్టా'... పరేడ్ అనంతరం ట్రిపుల్ ఆర్!
ఏపీ రాజకీయాల్లో కొన్ని కేసులు తీవ్ర సంచలనాలు సృష్టిస్తుంటాయి.. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్స్ గా ఉంటుంటాయి.
ఏపీ రాజకీయాల్లో కొన్ని కేసులు తీవ్ర సంచలనాలు సృష్టిస్తుంటాయి.. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్స్ గా ఉంటుంటాయి. అలాంటి వాటిలో జగన్ అక్రమస్తుల కేసు, కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసు మొదలైనవి ఉన్నాయని అంటారు. అలాంటివాటి సరసన చేరినట్లు చెప్పే మరో కేసు.. ట్రిపుల్ ఆర్ కస్టడీ టార్చర్ వ్యవహారం!
అవును... గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై అత్యంత భయంకరంగా ప్రవర్తించారనేది ట్రిపుల్ ఆర్ ఆరోపణ. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం.. ఆయనను సీఐడీ కస్టడీలో అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది.
దీనికి సంబంధించిన నిందితుడి గుర్తింపు పరేడ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో తనపై దాడిచేసినట్లు చెబుతున్న నిందితుడిని గుర్తించే పరేడ్ లో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో తులసి బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ సమయంలో పరేడ్ అనంతరం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... సీఐడీ కస్టడీలో తనను అంతమొందిమేందుకు యత్నించినట్లు నమోదైన కేసులో నిందితుడిని గుర్తించే పరేడ్ లో పాల్గొన్న రఘురామ కృష్ణంరాజు.. ఆ ప్రక్రియ అనంతరం స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు.. అతడికి కొంతమంది మద్దతివ్వడం అందరికీ తెలుసని అన్నారు.
ఇదే సమయంలో... తులసి బాబుకు, టీడీపీకి సంబంధం లేదని గుడివాడ వాసులు తనకు చెప్పారని చెప్పిన రఘురామ.. ఎస్పీ వద్దకు నేరుగా వెళ్లగల వ్యక్తి తులసిబాబు అని అన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరో కీలక నిందితురాలిగా ఉన్న గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభవతి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో... అప్పటి ఏఎస్పీ విజయ్ పాల్ లాగా డాక్టర్ ప్రభావతి కూడా పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చని.. అయితే, సుప్రీంకోర్టులోనూ వారికి బెయిల్ రాదని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ ను ప్రశ్నించాలని అన్నారు. అదేవిధంగా... ఈ కేసులో ఇప్పటివరకూ ఏ1, ఏ2లుగా ఉన్నవారికి నోటీసులు ఇవ్వలేదని, సస్పెన్షన్ చేయలేదని తెలిపారు.
ఇదే సమయంలో... ‘పీవీ సునీల్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా.. వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.. లేదంటే.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఎందుకు దర్యాప్తుకు పిలవడం లేదు.. సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్లని సస్పెండ్ చేయాలి.. కానీ, ఎందుకు చేయడం లేదో నాకు అర్ధం కావడం లేదు’ అని రఘురామ స్పందించారు.