భారత సార్వత్రిక ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడ వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

Update: 2024-09-10 07:25 GMT

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడ వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రవాస భారతీయులతో, విద్యార్థులతో సమావేశం అవుతున్నారు. ప్రఖ్యాత జార్జ్ టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయిన రాహుల్.. భారతదేశంలో జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు చేసిన ఆయన.. ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ఇటీవల భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆ పార్టీ 240 సీట్లు సాధించిందన్నారు. ఎన్నికలు ఏకపక్షంగా అన్నట్లుగా జరిగాయని.. అలా కాకుండా నిష్పక్షపాతంగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పారు. ఎన్నికల సందర్భంలో తమ ఖాతాలను స్తంభింప చేసి ఆ పార్టీ మాత్రం ఆర్థికంగా లబ్ధి పొందిందని అన్నారు. అదీకాక.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వారికి ఎలా కావాలో అలా వ్యవహరించిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల ప్రచారం.. నరేంద్ర మోడీ ఎజెండా మేరకు కొనసాగిందని తెలిపారు.

ఇంత చేసినా.. తాము పోటీనిచ్చామని, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. అలాగే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు.. బీజేపీ భ్రష్టు పట్టించిన సంస్థలన్నింటినీ గాడిలోకి తీసుకొస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ 300 నుంచి 400 సీట్లు గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారని.. కానీ 240 సీట్లకే పరిమితమైందని చెప్పారు. వారికి 240 లోపు సీట్లు వచ్చి ఉంటే ఆశ్చర్యపడిపోయే వాడినని.. వారికి అర్థబలం ఎక్కువ కాబట్టే ఆ మాత్రం సాధించారని విమర్శించారు.

తాను నేరుగా దేవుడితో సంభాషిస్తానని మోడీ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ స్పందించారు. మోడీ అంటే తనకు కోపం లేదని, కానీ ఆయన చూసే కోణంపైనే తన ఆగ్రహమని వెల్లడించారు. మోడీ మానసిక స్థితిపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో లెక్కలేనంత ప్రతిభ ఉందని, కానీ ఆ ప్రతిభకు ఇండియాలో చోటులేదన్నారు.

మొత్తంగా.. అమెరికాలో వరుస సమావేశాలతో బిజీ అయిపోయిన రాహుల్ బీజేపీ, మోడీపై విమర్శలు దాడులు చేయడాన్ని బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. రాహుల్ వైఖరి సరైనది కాదని విమర్శిస్తున్నారు. పొరుగు దేశంలో దేశం పరువు తీస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News