జమిలి ఎన్నికలపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

దేశంలో ఒకేసారి పార్లమెంటుకు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-03 12:39 GMT

దేశంలో ఒకేసారి పార్లమెంటుకు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు పెట్టడం కోసమే సెప్టెంబర్‌ నెలలో ఐదు రోజులు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందని టాక్‌ నడుస్తోంది.

మీడియా, ప్రతిపక్షాలు అంతా భావిస్తున్నట్టే జమిలి ఎన్నికలపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చైర్మన్‌ గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా పలువురు నేతలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. జమిలీ ఎన్నికల ఆలోచనతో భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమే బీజేపీ ఉద్దేశమని మండిపడింది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్టు తెలిసిపోతోందని ఎద్దేవా చేసింది. కమిటీలోనూ అమిత్‌ షా వంటి శక్తివంతమైన బీజేపీ నేతలను సభ్యులుగా పెట్టుకుంటే ఇక ఆ కమిటీ పనితీరు ఏంటో, సిఫార్సులు ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కమిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరికి కేటాయించిన అవకాశాన్ని తమ పార్టీ తిరస్కరించిందని వెల్లడించింది. ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు ద్వారా భారత్‌ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేయడమే బీజేపీ ఉద్దేశమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. భారత్‌ అంటే రాష్ట్రాల సమైఖ్యత అని ఆయన గుర్తు చేశారు.

జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ జైరామ్‌ రమేశ్‌ వ్యాఖ్యానించారు. కమిటీని ఏర్పాటు చేసిన సమయంపైనా తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. కమిటీ నియమ నిబంధనలను చూస్తే ఇప్పటికే కమిటీ సిఫార్సులను కూడా నిర్ణయించినట్లు తెలుస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించారని జైరామ్‌ రమేశ్‌ తెలిపారు.

మరో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అభివర్ణించారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే బీజేపీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తోందని మండిపడ్డారు.

వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే గెలుపని సర్వేలు చెబుతున్నాయని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తున్నాయని తేలిందన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

బీజేపీ ఓటమి తెలిసే తెరపైకి వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ తీసుకొస్తోందని రేవంత్‌ ధ్వజమెత్తారు. ఇండియా కూటమి జమిలి ఎన్నికలకు వ్యతిరేకమని తెలిపారు. జమిలి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అనుకూలంగా ఉందన్నారు. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లోనే సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని రేవంత్‌ గుర్తు చేశారు.

జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం ఏర్పడుతుందని రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News