ధర్మం వైపు నిలబడి ఓటేయమంటూ 'ధర్మం'గా మాట్లాడిన రాజగోపాల్
ఈ ఉప పోరులో.. ఏది ఏమైనా సరే గెలుపు గుర్రం తమదే కాదన్న మొండితనంతో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించటమే కాదు.. ఆయన వ్యూహాలు వర్కుట్ అయ్యాయని చెప్పాలి.
ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని తెలంగాణ రాజకీయ నేతల్లో ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే.. బలమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ.. ఎన్నికలు వచ్చే నాటికి మాత్రం అమితంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. మొన్నటికి మొన్న దేశం మొత్తం మునుగోడు వైపు చూసేలా చేసిన ఆయన ఎన్నికలో.. ఆయన ఓడిపోవటం తెలిసిందే. తన రాజీనామాతో వచ్చిన ఉప పోరులో ఆయన ఓడిపోవటం.. అందునా బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్నిక కావటం తెలిసిందే.
ఈ ఉప పోరులో.. ఏది ఏమైనా సరే గెలుపు గుర్రం తమదే కాదన్న మొండితనంతో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించటమే కాదు.. ఆయన వ్యూహాలు వర్కుట్ అయ్యాయని చెప్పాలి. కట్ చేస్తే.. మునుగోడులో తనకు తిరుగులేదన్న భావనలో ఉన్న రాజగోపాల్ కు దిమ్మ తిరిగేలా తీర్పు ఇచ్చారు మునుగోడు ప్రజలు. ఉప పోరు అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంతగూడు కాంగ్రెస్ కు తిరిగి వచ్చిన రాజగోపాల్.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలామంది రాజకీయ నేతల తీరుకు భిన్నంగా ఆయన ప్రచారం సాగుతోంది.
ప్రత్యర్థి మీద ఘాటు విమర్శలు చేయని ఆయన.. వినూత్నరీతిలో మాట్లాడుతున్నారు. ఓటర్లను కన్వీన్స్ చేసే తీరు ఆకట్టుకునేలా సాగుతోంది. తన ప్రత్యర్థి కమ్ బీజేపీ అభ్యర్థి చలమల క్రిష్ణారెడ్డి గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఆయనంటే తనకు చాలా గౌరవమని.. ఈ ప్రపంచంలో తాను మాత్రమే ఎమ్మెల్యే అవుతానని ఎవరికి వారు పోటీ చేస్తారని.. ఒకరిని ఓడించేందుకు ఎవరూ పోటీ చేయరన్న ఆయన.. చలమల క్రిష్ణారెడ్డి పోటీ గురించి తేల్చేశారు.
బీజేపీ అభ్యర్థి సొంత గ్రామం మల్లారెడ్డి గూడెంలో నిర్వహించిన ప్రచారంలో రాజగోపాల్ అక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టేందుకు తాను బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చిందని.. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినా.. గతంలో తాను కోట్లాడాను కాబట్టి తనకు టికెట్ ఇచ్చారంటూ చెప్పుకున్న ఆయన.. తనకు టికెట్ వచ్చినంతనే తాను చలమలకు ఫోన్ చేసి మాట్లాడానని.. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా.. ఎంపీగా అవకాశం వస్తుందని చెప్పానని చెప్పారు.
బీజేపీ.. బీఆర్ఎస్ ఒక్కటేనని.. బీజేపీని ప్రజలు నమ్మటం లేదని అందుకే తాను కాంగ్రెస్ కు వచ్చిన విషయాన్ని ఆయనకు చెప్పానని వివరించారు. చలమల బీజేపీలోకి ఎందుకు వెళ్లారు? ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఆయనకే తెలియనాలన్న ఆయన ఉప ఎన్నికల్లో డబ్బుల పంచి ఓట్లు చీల్చే ప్రయత్నం చేశారన్నారు. మల్లారెడ్డి గూడెంలో ఉన్న ప్రతి మనిషి గుండె మీద చేయివేసుకొని ఎవరు ఇక్కడి ప్రజల కోసం పాటుపడుతున్నారో.. ఎవరు కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నారో? ఎవరు సర్వస్వం కోల్పోయి ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో ఆలోచన చేయాలని కోరటం గమనార్హం. పైసలు ఎవరి దగ్గర తీసుకున్నా.. ధర్మం వైపు నిలబడి ఓటేయాలన్న రాజగోపాల్ మాటలు ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతలా మాట్లాడటం.. వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా చేసిన ఈ తరహా వ్యాఖ్యలకు మునుగోడు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.