చిలిపి వర్మ చేష్టలకు జరిగే డ్యామేజ్ మామూలుగా లేదట!

ఇలాంటి వారు చాలానే ఉంటారు. అలాంటి వారందరికి వర్మ లాంటి చిలిపి చిన్నోడు చేసే చేష్టలు చిరాగ్గా అనిపించటమే కాదు.. నీకెందుకు అతి? అన్న భావనను కలుగజేస్తాయి

Update: 2023-10-27 05:33 GMT

ఎవరు చేసే పని వారు చేయాలి. అలా అని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే అధికార వైసీపీ ఎదుర్కొంటోందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు.. జైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి మాట్లాడారే కానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడలేదు. కామెంట్లు చేయలేదు. సీఎం జగన్ అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు.. ఆయన పార్టీకి చెందిన వారు.. సానుభూతిపరులు మాత్రం భిన్నంగా చెలరేగిపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తన దారిలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద తన వాహనాన్ని ఆపి.. అక్కడి నుంచి ఒక సెల్ఫీ తీసుకోవటం తెలిసిందే. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘నేను బయట.. ఆయన లోపల’ అంటూ చంద్రబాబు ఉంటున్న జైలును చూపించే ప్రయత్నం చేశారు.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. విపరీతంగా వైరల్ కావటమే కాదు.. ట్రోల్ అయ్యింది. వర్మ లాంటి మేధావి మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. తనలాంటోడు చిలిపిచేష్టలకు పాల్పడితే తనకు జరిగే నష్టం కంటే.. తాను అభిమానించే పార్టీకి నష్టం వాటిల్లుతుందన్నది మర్చిపోకూడదు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు అంశంపై ఆయన తప్పు చేశారని నమ్మేవారు ఉన్నట్లే.. తప్పు చేయలేదని నమ్మే వారు ఉంటారు. వీరిద్దరు కాకుండా.. వాస్తవాలు.. కంటికి కనిపించే ఆధారాల.. బయటకు వచ్చే లాజిక్కు ఆధారంగా స్పందించే వర్గం ఒకటి ఉంటుంది.

ఇలాంటి వారు చాలానే ఉంటారు. అలాంటి వారందరికి వర్మ లాంటి చిలిపి చిన్నోడు చేసే చేష్టలు చిరాగ్గా అనిపించటమే కాదు.. నీకెందుకు అతి? అన్న భావనను కలుగజేస్తాయి. ఒకరు కష్టంలో ఉన్నారన్నప్పుడు.. ఎంత తప్పు చేసినప్పటికీ జైల్లో ఉన్నారన్న వేళ.. వారిని... వారి వర్గాన్ని రెచ్చగొట్టేలా చేసే చేష్టల్ని తప్పు పట్టేటోళ్లు ఉంటారు. అలాంటి వారందరికి వర్మ తీరుకు ఫీల్ కావటం ఖాయం. నా సినిమా నా ఇష్టం లాంటి మాటలు సినిమాలకు ఓకే కానీ.. రాజకీయాల్లో తాను అభిమానించటం అన్న ఒక్క కారణంగా తన చేష్టలతో పార్టీకి నష్టం వాటిల్లే తీరును ఆమోదించలేం. ఇలాంటి చేష్టల విషయంలో వర్మ అతిని కట్టడి చేయకుంటే.. సానుభూతి పెరిగి.. పార్టీకి వ్యతిరేకంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News