బీజేపీకి రాములమ్మ రామ్ రామ్...!
ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించిన దగ్గరనుంచి విజయశాంతి దాదాపుగా దూరం అయినట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.
అనుకున్నదే అయింది. భారతీయ జనతా పార్టీకి విజయశాంతి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డికి తన రాజీనామా లేక పంపారు. గత కొంతకాలంగా విజయశాంతి బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.
ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించిన దగ్గరనుంచి విజయశాంతి దాదాపుగా దూరం అయినట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆమె జి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు.
ఇక ఆమె కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేసీయార్ మీద తాను పోటీలో ఉంటాను అని ఆమె అన్నా పార్టీ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు అని అంటారు. ఇక ఆమెను స్టార్ కాంపెనియర్ గా కూడా మొదట ప్రకటించలేదు. ఆ తరువాత ప్రకటించారు.
ఇలా తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని, తన సేవలు అవసరం లేదని భావించిన మీదటనే విజయశాంతి బీజేపీకి దూరం జరుగుతూ వచ్చారు అని అంటున్నారు. ఇక ఆమె తన రాజకీయ భవిష్యత్తు మీద ఆలోచనలతోనే పార్టీని వీడారని అంటున్నారు.
దీనికంటే ముందు కొద్ది రోజుల క్రితం ఆమె ట్వీట్ కూడా చేశారు. కాంగ్రెస్ లో ఉండి పోరాడాలని కోరుతున్నారని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ఇవన్నీ ఇలా ఉన్నా ఆమెని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.
జనసేన తెలంగాణాలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ని కలసి పొత్తు పెట్టుకుని ఆయనతో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నించింది అని అంటున్నారు. అంతే తప్ప విజయశాంతి అవసరం లేదు అన్నట్లుగా వ్యవహరించడం వల్లనే ఆమె విసిగి వేశారిపోయారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
ఇక గతంలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన విజయశాంతికి ఈసారి కూడా మెదక్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరించింది అని అంటున్నారు. ఈ మేరకు ఆమెను సాదరంగా కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతోనే ఆమె కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు అని అంటున్నారు. మొత్తానికి ఈ కీలక సమయంలో విజయశాంతి పార్టీని వీడడం బీజేపీకి అతి పెద్ద షాక్ అని అంటున్నారు.
అదే టైం లో ఆమె కాంగ్రెస్ లో చేరితే కనుక ఆ పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చినట్లుగా ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా ఆమె రాకతో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అన్న సంకేతాలు కూడా పాజిటివ్ గా జనంలోకి వెళ్తాయని అంటున్నారు.