శభాష్ టాటాజీ: ఆ వయసులో పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటేశారు

దేశ ప్రజల మనసుల్ని మరోసారి దోచేశారు భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా

Update: 2024-05-21 03:50 GMT

దేశ ప్రజల మనసుల్ని మరోసారి దోచేశారు భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా. 86 ఏళ్ల వయసులో తన ఓటుహక్కును వినియోగించుకోవటానికి ఆయన పడిన ప్రయాస చూసినప్పుడు.. ఆయన కమిట్ మెంట్ ను అభినందించకుండా ఉండలేం. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటూ ట్వీట్ తో పిలుపు ఇచ్చిన ఆయన.. తాను కూడా వెళ్లి అందరి మనసుల్ని దోచేశారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని కోల్బాలోని పోలింగ్ బూత్ లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఆదర్శాల్ని చెప్పే కన్నా.. తాను స్వయంగా పాటించే లక్షణం రతన్ టాటా సొంతం. ఏ విషయంలో అయినా విభేదాలు ఉండొచ్చేమో కానీ.. రతన్ టాటాను అభిమానించే విషయంలో ఎవరికి ఎలాంటి ఫిర్యాదు ఉండదు. అలాంటి వ్యక్తిత్వం ఆయన సొంతం. సోమవారం జరిగే పోలింగ్ గురించి రెండు రోజుల ముందు ట్వీట్ చేసిన రతన్ టాటా.. ముంబయి మహానగరంలోని ఓటర్లు అందరూ బయటకు వచ్చి బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. ‘‘ముంబయివాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని కోరుతున్నా. సోమవారం ముంబయిలో పోలింగ్ రోజు’’ అంటూ తన ట్వీట్ తో పిలుపునిచ్చారు.

నిజానికి 85 ఏళ్లు నిండిన వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. 86 ఏళ్ల రతన్ టాటా మాత్రం తనకున్న సదుపాయాన్ని వినియోగించుకోకుండా.. స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేసి తిరిగి వెళుతున్న వేళలో.. ఆయనతో మాట్లాడేందుకుప్రయత్నించిన వారితో హుషారుగా మాట్లాడిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఏమైనా రతన్ టాటా ఇస్పెషల్ అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News