పైలట్ పొరపాటే రావత్ ప్రాణం తీసింది
ఈ ప్రమాదానికి కారణాలపై అధ్యయనం చేసిన స్టాండింగ్ కమిటీ పలు సంచలన విషయాలను బయటపెట్టింది.
త్రివిధదళాల అధిపతి, దేశ అత్యున్నత సైనిక కమాండర్, జనరల్ బిపిన్ రావత్ దుర్మరణానికి పైలట్ తప్పిదమే కారణమని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. డిసెంబర్ 8, 2021న అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో రావత్, ఆయన భార్య మధులికతోపాటు మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణాలపై అధ్యయనం చేసిన స్టాండింగ్ కమిటీ పలు సంచలన విషయాలను బయటపెట్టింది.
2021 డిసెంబర్ 8న ఎంఐ-17 హెలికాఫ్టర్లో జనరల్ బిపిన్ రావత్ కుటుంబంతో సహా తమిళనాడులోని కోయంబత్తూర్ సూలూర్ ఎయిర్ ఫోర్స్ చేస్ నుంచి వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి బయలుదేరి వెళ్లారు. సడన్ గా వాతావరణంలో మార్పు రావడం, మేఘాల్లోకి చాపర్ ప్రవేశించడంతో క్రాష్ అయింది. ఈ సంఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా చాప్టర్లో ప్రయాణిస్తున్న వారు అంతా మరణించారు. ఈ సంఘటన జరిగిన మూడేళ్లకు ప్రమాదానికి గల కారణాలపై లోక్ సభకు నివేదిక సమర్పించారు.
జనరల్ రావత్ జనవరి 2020 నుంచి 2021 డిసెంబర్ లో మరణించే వరకు మన దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2021లో పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో 1958 మార్చి 16న బిపిన్ రావత్ జన్మించారు. 1978 డిసెంబర్లో డెహ్రాడూన్ లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో 11వ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో 5వ రెజిమెంట్లో చేరారు. డెహ్రాడూన్ లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాప్తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వహించారు. 2016 డిసెంబర్ లో కమాండర్ ఇన్ చీఫ్గా నియమితులయ్యారు.
కాగా, జనరల్ బిపిన్ రావత్ మరణానికి పైలట్ తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమని రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. 2017-2022 మధ్య భారతీయ వైమానిక దళానికి చెందిన మొత్తం 34 విమానాలు ప్రమాదాలకు గురయ్యాయని నివేదికలో స్పష్టం చేశారు. 2021-22 మధ్య జరిగిన 9 ప్రమాదాల్లో జనరల్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ ఒకటి. ఈ ప్రమాదాల నేపథ్యంలో రక్షణ శాఖ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.