రికార్డే గురూ : బాబు 29 సార్లు...జగన్ 24 సార్లు...!

బాబు విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు.

Update: 2024-02-12 04:30 GMT

ఏపీని గత దశాబ్ద కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాలించారు. ఆ ఇద్దరే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్. ఈ ఇద్దరూ కూడా కేంద్రంలోని ప్రభుత్వంతో బాగానే ఉన్నారు. బాబు విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు. కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా పనిచేశారు.

ఇక జగన్ విషయానికి వస్తే కేంద్రంతో సఖ్యత పేరుతో అయిదేళ్ల పాటు సహకారం అందించారు. ఇక ఏపీకి ఇద్దరు సీఎంలు మారినా కూడా కేంద్రంలో మాత్రం గడచిన పదేళ్లలో ఒక్కరే ప్రధానిగా ఉన్నారు. ఆయనే నరేంద్ర మోడీ. అలాగే ఒక్కటే ప్రభుత్వం ఉంది అదే బీజేపీ.

మరి బీజేపీ ఈ పదేళ్ళలో ఏపీకి చేసిన సాయం ఎంత. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రం వద్ద తమ పలుకుబడిని ఎంత చూపించారు. అసలు మోడీకి ఎవరు ఎక్కువ చనువు. ఎవరు ఎక్కువ నిధులు ఏపీకి తెచ్చారు ఇత్యాది ప్రశ్నలు సగటు ప్రజలలో ఉన్నాయి.

మరో వైపు చూస్తే కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో చాలా వరకూ ఈ ఇద్దరూ సాధించలేకపోయారు అన్నది కాంగ్రెస్ విమర్శ. అందులో అతి పెద్ద హామీ ప్రత్యేక హోదా. దాన్ని 2014 ఎన్నికల ముందు బీజేపీయే ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ మాత్రం దాన్ని ఇవ్వలేకపోయారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయారు అన్నది మరో విమర్శ. అయితే కేంద్రంతో గట్టిగా ఫైట్ చేసి సాధించాల్సిన ఇద్దరు ముఖ్యమంత్రులకూ ఇది పెద్ద ఫెయిల్యూర్ గానే కాంగ్రెస్ అంటోంది.

ముందుగా చంద్రబాబు గురించి తీసుకుంటే ఆయన 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో చివరి ఏడాది తప్ప మిగిలిన కాలమంతా ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. కేంద్రంతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా రాలేదు. అలాగే పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి రాజధాని అని అన్నారు. కానీ దాన్ని కేంద్రం పూర్తి నిధులు ఇచ్చి నిర్మించేలా చర్యలు తీసుకోలేకపోయారు

విభజన హామీలు కూడా బాబు హయాంలో నెరవేరలేదు. వెనకబడిన జిల్లాలకు ప్రతీ ఏటా రావాల్సిన యాభై కోట్ల రూపాయల నిధులు రాలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు, ఇలా అనేక హామీలు ఉండిపోయాయి. చంద్రబాబు అయితే తాను ఏపీ కోసం కేంద్రం వద్ద అనేక సార్లు ప్రస్తావించాను అని చెప్పుకున్నారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లాను అని 2019 ఎన్నికల ముందు చంద్రబాబు తరచూ చెప్పిన మాట.

సీన్ కట్ చేస్తే జగన్ 2019 మే 30న సీఎం అయ్యారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 9 వరకూ చూస్తే మొత్తం 24 సార్లు ఢిల్లీ టూర్ చేశారు. అంటే చంద్రబాబు కంటే అయిదు సార్లే తక్కువ అన్న మాట. ఇలా జగన్ ఢిల్లీ టూర్లు ఇన్ని సార్లు చేస్తే అందులో మోడీతో జగన్ భేటీ అయినవి ఎన్ని సార్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 23 సార్లు మోడీతో భేటీ అయ్యారు. అంటే ఒకే ఒక్కసారి ఢిల్లీ టూర్ లో ప్రధానికి కలవలేదు అని అంటున్నారు. ఇదంతా ప్రచారంలో ఉన్న విషయమే.

ఇదిలా ఉంటే జగన్ ఇన్ని సార్లు దేశ ప్రధానికి కలిశారు కదా మరి ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా సహా అనేక హామీలు నెరవేరలేదు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దానికి వైసీపీ నేతలు ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఏపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు తెచ్చామని, సరే నిధులు ఏపీకి తెచ్చారు. కేంద్రం వాటిని ఇవ్వడం బాధ్యత అయినా సఖ్యత ఉన్న చోట బాగా ఇస్తారు అన్నది కూడా ఉంది. సో అంతవరకూ ఓకే అనుకున్నా విభజన హామీల విషయంలో మాత్రం జగన్ సర్కార్ ఎందుకు పూర్తిగా కేంద్రం నుంచి అన్నింటినీ నెరవేర్చలేకపోయింది అన్నది మాత్రం ప్రజలలో చర్చకు వస్తోంది.

దీని మీద ఇటీవల మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా జగన్ మీద విమర్శలు చేశారు. ఢిల్లీకి ఎక్కువ సార్లు వెళ్ళిన సీఎం గా జగన్ రికార్డు సృష్టించారని కానీ ఎందుకు ఆయన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కేంద్రం నుంచి నెరవేర్చేలా కృషి చేయలేదని నిలదీశారు. ఏది ఏమైనా చంద్రబాబు జగన్ ఇద్దరూ కేంద్ర పెద్దలతో తమ పదవీ కాలంలో దేశంలో ఏ సీఎం కలవనంతంగా కలిశారు అన్నది వారి ఢిల్లీ టూర్ల నంబర్లను బట్టి అర్ధం అవుతోంది.మరి కేంద్రం మాత్రం ఏపీకి సంబంధించి పెద్దగా చేయలేదు అంటే అది ఎవరి తప్పు అన్నది మాత్రం జనాల్లో ఉన్న అతి పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News