తప్పునెంబరుకు యూపీఐ చేశారు? మీ డబ్బులు తిరిగి వస్తాయి ఇలా
ఒక్కోసారి తప్పుడు నెంబర్లకు యూపీఐ చెల్లింపులు జరిపే తప్పును చాలామంది చేస్తుంటారు.
జేబులో పర్సు లేకున్నా.. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సరి అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ మాటకు వస్తే రూ.100నోటు లేదంటే రూ.200 నోటు ఇచ్చి.. చిల్లర కోసం అడిగితే.. డిజిటల్ పేమెంట్ చేయొచ్చుకదా? అన్న మాటే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. చివరకు రూ.5 పేమెంట్ కోసం కూడా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు ఇప్పుడు. అంతలా పెరిగిపోయిన డిజిటల్ పేమెంట్లలో ఒక చిన్న చిక్కుముడిఉంది. ఒక్కోసారి తప్పుడు నెంబర్లకు యూపీఐ చెల్లింపులు జరిపే తప్పును చాలామంది చేస్తుంటారు.
ఇలాంటప్పుడు ఏంచేయాలి? తప్పు నెంబరకు పంపిన డబ్బులు తిరిగి రావా? దానికి మరో మార్గం లేదా? అని కంగారు పడే వారు చాలామందే ఉంటారు.అయితే.. ఒక క్రమపద్దతిలో కొన్ని విధానాల్ని ఫాలోఅయితే.. తప్పుగా పంపిన డబ్బులు వచ్చి మన ఖాతాలో పడే వీలుంది. నిజానికి నెంబర్లతో పని లేకుండా.. ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక క్యూఆర్ కోడ్ ఉన్నప్పటికి.. కొందరు నేటికి నెంబర్ల ద్వారానే పేమెంట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ నెంబరుకు డబ్బులు పంపే కన్నా.. వారి అకౌంట్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. పొరపాటు జరిగే అవకాశం దాదాపుగా తగ్గే వీలుంటుంది.
మరి.. రాంగ్ నెంబరుకు డబ్బులు పంపినప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బుల్ని వెనక్కి ఎలా తెచ్చుకోవాలి? అన్న వివరాల్లోకి వెళితే.. ఇందులో మొదటి దశ.. డబ్బులు తప్పుగా పంపిన వారికి.. విషయం వివరించి.. మీ డబ్బుల్ని వెనక్కి పంపాల్సిందిగా కోరచ్చు. చాలామంది అందుకు సానుకూలంగా స్పందిస్తారు. అయినా.. అలా జరగకుంటే.. యూపీఐ యాప్ లోని కస్టమర్ సపోర్టు టీంతో మాట్లాడాల్సి ఉంటుంది.
వారు తగిన సహాయ.. సహకారాలు అందిస్తారు. లావాదేవీ వివరాల్ని అందించటం ద్వారా మీ కంప్లైంట్ ను పరిశీలిస్తారు. అలా కూడా కాదంటే.. రాంగ్ యూపీఐకు చెల్లింపు చేస్తే ముందు బ్యాంక్ కస్టమర్ కేర్ సర్వీస్ విభాగానికి ఫోన్ చేయాలి. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిగిన పొరపాటుకు సంబంధించిన వివరాల్ని టోల్ ఫ్రీ నెంబరు 180012201740కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని వారికి తెలియజేయాల్సి ఉంటుంది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐలో తప్పుడు లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం తప్పు యూపీఐ ఐడికి డబ్బులు పంపిన 24 నుంచి 48గంటల్లోపు రాంగ్ గా పంపిన డబ్బుల్ని తిరిగి పొందే వీలుంది. అయితే.. ఇక్కడో అంశాన్ని గుర్తించాలి. డబ్బులు పంపిన వ్యక్తి.. తీసుకున్న వ్యక్తి ఒకే బ్యాంక్ ను ఉపయోగించిన టైంలో ఇది మరింత త్వరగా పరిష్కారం అయ్యే వీలుంది.
వేర్వేరు బ్యాంకులు అయినప్పటికి ఫర్లేదు కానీ కాస్త ఆలస్యమవుతుంది.అయినప్పటికీ.. మీ సమస్య పరిష్కారం కాకుంటే ‘ఎన్ పీసీఐ’ పోర్టల్ ద్వారా కూడా కంప్లైంట్ చేసే వీలుంది. ఎన్ పీసీఐ పోర్టల్ కు వెళ్లి.. ‘What we do’ పైన క్లిక్ చేయాలి. అక్కడ అనేక ఆప్షన్స్ కనిపించినప్పటికి వాటిలో యూపీఐను ఎంపిక చేసుకోవాలి. దీని తర్వాత కంప్లైంట్ విభాగంలోకి వెళ్లి.. లావాదేవీ వివరాల్ని పూర్తి చేయాలి. ఇందులో బ్యాంక్ పేరు. ఈ మొయిల్.. ఫోన్ నెంబరు.. యూపీఐ ఐడీ మొదలైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రాంగ్ యూపీఐ అడ్రస్ కు పంపిన అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. దీనికి సరిపోయే వివరాల్ని జోడించాల్సి ఉంటుంది. కంప్లైంట్చేసిన 30 రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే.. బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ లను సంప్రదించొచ్చు. రూల్స్ ప్రకారం సంఘటన జరిగిన మూడు రోజుల్లోపు రాంగ్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్న విషయానని మర్చిపోవద్దు సుమా.