టీడీపీలో 23 మంది రెడ్డి ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటికీ ఇంతటి ఘోర ఓటమికి కారణాలు ఏమిటో తెలుసుకోలేని స్థితిలో వైసీపీ ఉందంటున్నారు. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా రాష్ట్రంలో మూడు ప్రాంతాలు.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోయింది.
కాగా ఈ ఎన్నికలకు సంబంధించి అనేక సంచలనాలు నమోదయ్యాయి. సహజంగా రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఎక్కువ ఉంటారు. అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే కుదేలవ్వడంతో ఆ పార్టీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే రెడ్డి ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో పులివెందుల నుంచి వైసీపీ అధినేత జగన్, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు.
మరోవైపు టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో ఏకంగా 23 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. టీడీపీ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రాంతాలకతీతంగా టీడీపీ దుమ్ములేపేసింది. ముఖ్యంగా వైసీపీకి ఏకపక్ష ఆధిపత్యం ఉంటుందనుకున్న రాయలసీమలోనూ టీడీపీ ఘనవిజయాలు సొంతం చేసుకుంది. దీంతో అక్కడ నుంచి సహజంగా పెద్ద ఎత్తున రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మొత్తం 23 మంది ఆ వర్గం ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున విజయం సాధించారు.
గుంటూరు జిల్లా.. మాచర్ల, ప్రకాశం జిల్లా.. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, నెల్లూరు జిల్లా.. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వైఎస్సార్ జిల్లా.. కడప, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లా.. ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె, డోన్, అనంతపురం జిల్లా.. తాడిపత్రి, పుట్టపర్తి, చిత్తూరు జిల్లా.. పీలేరు, శ్రీకాళహస్తి, పలమనేరుల నుంచి టీడీపీ తరఫున రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.
2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలు మాత్రమే సాధించింది. అందులోనూ రాయలసీమలో కేవలం మూడు సీట్లే దక్కించుకుంది. దీంతో నాడు టీడీపీ తరఫున రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఎవరూ ఎన్నికవ్వలేదు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో ఏకంగా 23 మంది రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు.
ఇక బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ తరఫున ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయినా వీరిలో రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు.