రిమాండ్ బాబు... సుప్రీం తీర్పు చెంపపెట్టు...!
ఆయనను అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని కూడా చెబుతూ వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ ఇవ్వడం సబబే అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు తీర్పు సందర్భంగా వెల్లడించింది. అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17 ఏ సవరణ వర్తిస్తుందా రాదా అన్న దాని మీద ఇద్దరు న్యాయమూర్తులూ భిన్నంగా తీర్పు చెప్పగా బాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ఇవ్వడం సబబే అని స్పష్టం చేయడంతో ఇది టీడీపీ అధినేతకు చెంపపెట్టు లాంటి తీర్పు అని అంటున్నారు.
ఇక స్కిల్ స్కాం కేసులో మొదటి నుంచి టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఆయన న్యాయవాదులు కానీ చెబుతున్నది ఏంటి అంటే చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేస్తారు అని. ఆయన అరెస్ట్ అక్రమం అని. ఆయనను అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని కూడా చెబుతూ వచ్చారు.
ఇక దీనిమీద సుప్రీం కోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగిన తరువాత తీర్పు రిజర్వ్ చేయబడింది. ఆ తీర్పు ఈ రోజు వెలువడింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులూ రెండు రకాలుగా తీర్పు చెప్పారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం అయింది అని అంటున్నారు.
స్కిల్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ మీద జస్టిస్ బోస్ తీర్పు ఏ విధంగా ఉందంటే ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని అన్నారు. బాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని కూడా చెప్పారు. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదని అన్నారు. ఇలా చెబుతూనే బాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేమని చెప్పడం విశేషం. అంతే కాదు, అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు అని స్పష్టం చేశారు. జస్టిస్ బోస్.
ఇక ఇదే కేసులో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు అని ఆయన సుస్పష్టంగా తేల్చేశారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేమని అన్నారు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అని కూడా పేర్కొనడం విశేషం.
అదే విధంగా అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేమని అన్నారు. . అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అని స్పష్టం చేశారు. ఇలా చూస్తే కనుక ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు చెప్పినా బాబు అరెస్ట్ రిమాండ్ విషయంలో మాత్రం టీడీపీకి ఊరటను ఇవ్వలేదని అంటున్నారు.
అంతే కాదు, కేసులో రిమాండ్ విధించే అధికారం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు పూర్తిగా ఉందని ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పేసింది. అయితే అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించడంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
మరో వైపు చూస్తే ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధారకరెడ్డి కూడా ఈ తీర్పు మీద మాట్లాడుతూ చంద్రబాబు మీద విచారణ కొనసాగించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అని అన్నారు. చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేయలేదని ఈ తీర్పు వల్ల అర్థం అయింది అని అన్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కుదరదు అని ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారని కూడా ఆయన గుర్తు చేశారు. మొత్తానికి ఈ తీర్పు బాబు విషయంలో మాత్రం ఊరటను ఇవ్వకపోగా బెయిల్ మీద ఉంటూ విచారణకు ఎదుర్కొనే పరిస్థితిని అయితే కల్పించింది అని అంటున్నారు.