4వ నగరంలో.. విశ్వ వాణిజ్య కేంద్రం.. రేవంత్ అద్భుత ప్లాన్

బహుశా ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు.. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) అంటే 2001 వరకు పెద్ద ఆశ్చర్యం

Update: 2024-09-10 08:04 GMT

బహుశా ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు.. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) అంటే 2001 వరకు పెద్ద ఆశ్చర్యం.. ఆ రెండు టవర్లను ప్రపంచ వాణిజ్య సింబల్ గానూ భావించేవారు అంటే ఆశ్చర్యం కాదు. అయితే, వీటిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని విమానాలతో కూల్చివేయడం.. ఆ తర్వాత దానిని గ్రౌండ్ జీరోగా మార్చివేయడం వేరే సంగతి. కానీ.. ఉగ్రవాదులు కూల్చివేసి సరిగ్గా 23 ఏళ్లయినప్పటికీ.. డబ్ల్యూటీసీ టవర్లను తలచుకున్నప్పుడల్లా అదో వెలితిగా అనిపిస్తుంటుంది. ఇప్పుడలాంటి టవర్లే.. మన హైదరాబాద్ నాలుగో నగిరిలో రానున్నాయి.

నాలుగో నగరం కాదు.. ఫ్యూచర్ సిటీ

హైదరాబాద్, సికింద్రాబాద్.. చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్న సైబరాబాద్.. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాలుగో నగరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇది విజయవంతం అయితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటికే హైదరాబాద్ నిండిపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే నాలుగో నగరి ఏర్పడితే.. కొంత భారం తగ్గడంతో పాటు విశ్వ నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్ కు మరింత చాన్స్ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే స్కిల్ యూనివర్సిటీ (నైపుణ్య విశ్వవిద్యాలయం)ను అక్కడ నిర్మిస్తున్నారు. దీంతోపాటు పర్యాటక, ఆరోగ్య, వినోద కేంద్రాలనూ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి ఏ కొత్త సంస్థనయినా అక్కడే చేపట్టాలని నిర్ణయించారు.

మనకూ ఓ డబ్ల్యూటీసీ

ఫ్యూచర్ సిటీని కాలుష్య రహింగా గ్రీన్ ఫార్మా సిటీగా చేపట్టాలని రేవంత్ ఆదేశించారు. దాని డెవలప్ మెంట్ ను వేగిరం చేయాలని.. భారీ పెట్టుబడులకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీలో డబ్ల్యూటీసీ తరహాలో విశ్వ వాణిజ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసేలా రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తునారు. ఈ మేరకు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ముందుకురావడం విశేషం. వీరు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిసింది. తమ ప్రాధామ్యాలను.. అంటే రైల్, రోడ్ కనెక్టివిటీ, మెయిన్, లింక్ రోడ్ల సౌకర్యాలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయం తదితరాలపై ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది.

దీంతో భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ, పరిశ్రమలశాఖ అధికారులు డబ్ల్యూటీసీకి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగమైన కృత్రిమ మేధ (ఏఐ) నగరానికి సమీపంలో మూడు ప్రాంతాలను దీనికోసం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

50 ప్లస్ 20 ఎకరాలు

డబ్ల్యూటీసీ టవర్లకు 50 ఎకరాలు ఇవ్వాలనుకుంటే.. పార్కింగ్ కు 20 ఎకరాలు ముందే కేటాయించాలని వాటి ప్రతినిధులు కోరుతున్నారు. సౌరశక్తి ప్లాంట్లు, కమ్యూనికేషన్‌ భారీ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారుల వద్ద ప్రతిపాదించారు. స్థలాల ఎంపికలో వీటన్నిటినీ పరిశీలించనున్నారు. కాగా, అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నుంచి ఇతర దేశాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ హక్కులు పొందింది. అందులోభాగంగానే భారత్ లో సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ లో, ఏపీలోని విశాఖపట్నంలో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబైలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చెన్నై, అహ్మదాబాద్, అమృత్‌ సర్, అమరావతి, భోపాల్, గోవా, జయపుర, కొచ్చి, లక్నో, భువనేశ్వర్, పుణె, వారణాసి నగరాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Tags:    

Similar News