జడ్పీటీసీ నుంచి సీఎం వరకూ.. హ్యాపీ బర్త్ డే రేవంత్ గారూ..!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ సంచలనం. ఎక్కడెక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన డైనమిక్ లీడర్‌గా ఎదిగారు

Update: 2024-11-08 06:43 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ సంచలనం. ఎక్కడెక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన డైనమిక్ లీడర్‌గా ఎదిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రాకకు ముందు కాంగ్రెస్, రేవంత్ వచ్చాక కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితిని మార్చేశారు. పదేళ్లలో కాంగ్రెస్‌కు సాధ్యం కాని అధికార పీఠాన్ని.. సాధించిపెట్టారు. ప్రత్యర్థి బలంగా ఉన్నప్పటికీ ఏ మాత్రం బెదరకుండా ఢీకొట్టి సక్సెస్ అయ్యారు. జడ్పీటీసీ నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. ఈ రోజు ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నారు. అసలు ఓ జడ్పీటీసీ సీఎం అవుతారని బహుషా ఆయన స్వగ్రామ ప్రజలు కూడా అనుకోని ఉండరు. కానీ.. అది రేవంత్‌కు సాధ్యపడింది. అయితే.. అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో తన బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నారు.

అనుముల రేవంత్ రెడ్డి 1969 నంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్ర విద్యాలయ కళాశాల నుంచి ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయనలో రాజకీయ లక్షణాలు వెలుగుచూశాయి. ఆ క్రమంలో ఏబీవీపీలో సభ్యుడిగానూ కొనసాగారు. మాజీమంత్రి జయపాల్‌రెడ్డి మేనకోడలు అయిన గీతారెడ్డిన ఆయన పెళ్లి చేసుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు బీజం వేసినట్లుగా అయింది. రాజకీయాల్లో స్థిరపడేందుకు మంచి ప్లాట్‌ఫాం దొరికింది రేవంత్‌కు.

రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జడ్పీటీసీగా బరిలోకి దిగారు. మొదటిసారే ఎన్నికల్లో విజయం సాధించి తన పోరాట స్ఫూర్తిని చాటారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇక.. రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభించారన్న విషయం తెలిసిందే. ఆయన మొదటి సారి ఎమ్మెల్సీగా ఎన్నికైంది కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే. దీంతో రేవంత్ పోరాటపటిమను చూసిన చంద్రబాబు ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు. రేవంత్ సత్తాను చూసి అంతర్గత వ్యవహారాల్లోనూ కీలక స్థానం కల్పించారు. అంతేకాదు.. రేవంత్ 2009లో కొడంగల్‌లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైఎస్సార్ వేవ్ చాలా బలంగా ఉంది. అయినప్పటికీ.. ఆ తుఫానులోనూ రేవంత్ విజయం సాధించారు.

ఇక.. రాష్ట్ర విభజన అనంతరం 2014లో కొడంగల్ నుంచి మరోసారి రేవంత్ టీడీపీ తరఫున గెలుపొందారు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. 2015లో అనూహ్యంగా ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భం ఆయన రాజకీయ జీవితంలో చీకటి రోజులనే చెప్పాలి. ఇక.. 2017లో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసినా ఓడిపోయారు. దాంతో ఆయన పోటీ చేసే స్థానాన్ని మార్చుకున్నారు. 2019లో మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి.. తన రాజకీయ మనుగడను మరోసారి నిలుపుకున్నారు.

రేవంత్ సత్తా, ఆయన పట్టుదలను చూసిన కాంగ్రెస్ హైకమాండ్ 2023లో పీసీసీ ప్రెసిడెంటుగా బాధ్యతలు అప్పగించింది. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీకి మునుపటి పరిస్థితులను తీసుకురావడంలో ఎంతగానో రేవంత్ కృషి చేశారు. పాదయాత్ర చేశారు. ఒంటిచేత్తోనే ప్రచారంలో పాల్గొన్నారు. అటు సీనియర్ల నుంచి పెద్దగా ఆయనకు సపోర్టు లభించలేదు. కానీ.. అందరినీ ఒక తాటిపైకి చేర్చి రాజకీయ ధీశాలి అయిన కేసీఆర్‌‌ను మట్టికరిపించి సీఎం సింహాసనంపై కూర్చుకున్నారు. ఇక.. గత 10 నెలలుగా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో ప్రజలకు పాలన అందిస్తున్నారు. ఫ్యూచర్‌లోనూ మరోసారి కాంగ్రెస్ పార్టీకే అవకాశం రావాలనే ఉద్దేశంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News