జిల్లాలకూ హైడ్రా.. ముందుగా ఆక్రమణ కూల్చివేతలు అక్కడినుంచే
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లోనూ హైడ్రా తరహా చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చారు.
ఏ ముహూర్తాన హైదరాబాద్ లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అథారిటీ (హైడ్రా) మొదలైందో కానీ.. దానికి వీర హారతులు పడుతున్నారు. ప్రజల స్వచ్ఛందంగా కదిలి తమ ప్రాంతంలోని ఆక్రమణల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా.. మా గల్లీకి రా.. అని బొట్టుపెట్టి మరీ పిలుస్తున్నారు. కాగా, హైడ్రా అంటేనే ఇప్పుడు హైదరాబాద్ లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నోటీసుల్లేవ్.. గీటీసుల్లేవ్.. నేరుగా కూల్చివేతలే అంటోంది ఆ సంస్థ. వర్షాలు-వరదలతో కాస్త నెమ్మదించింది కానీ.. లేదంటే ఇప్పుడు హైడ్రా దడదడలాడించేసేది. అయితే, ఈ వర్షాలు ఒకింత మేలే చేశాయన్నట్లుగా హైడ్రా మరో అడుగు వేస్తోంది.
జిల్లాల్లోనూ దమ్ము చూపనుంది..
హైడ్రా తరహాలోనే తమ ప్రాంతంలోనూ ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలుచోట్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మా ఊరిలో ఒకప్పుడు 8 ఎకరాల్లో చెరువు ఉండేదంటూ.. దాన్ని వెదికి పెట్టమని కొందరు పోలీసులకూ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో హైడ్రాను జిల్లాలకూ విస్తరించనున్నారని తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లోనూ హైడ్రా తరహా చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చారు. చెరువుల ఆక్రమణ క్షమించరాని నేరం అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర నష్టం జరుగుతోందని.. అందుకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీనిని జిల్లాలకూ విస్తరించాలనే డిమాండ్ వస్తోందని తెలిపారు. అయితే, జిల్లాల యంత్రాంగమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ముందుగా ఖమ్మంలోనే?
తాజాగా వరదలకు ఖమ్మం నగరం తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఆ నగరాన్ని ఆనుకుని ప్రవహించే మున్నేరు వాగు పోటెత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది. వందేళ్లలో లేనంత వరద కారణంగానే ఇలా జరిగిందని.. 45 సెంటీమీటర్ల వర్షం కురిసిందని మంత్రి తుమ్మల చెప్పగా.. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందని సీఎం రేవంత్ అన్నారు. మున్నేరు ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని ప్రకటించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి వీటిని తొలగిస్తామని వెల్లడించారు.
మున్నేరు రిటైనింగ్ గోడ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు. వరదలపై మాజీ మంత్రి హరీశ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై కూడా స్పందించాలని కోరారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారని.. వాటిని తొలగించాలని చెప్పాలని సూచించారు. రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటవుతుందని స్పష్టం అవుతోంది. దాని మొదటి టార్గెట్ ఖమ్మం జిల్లానే అవుతుందని కూడా తెలుస్తోంది.
కొసమెరుపు: హైడ్రా అంటే డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అథారిటీ. మరి జిల్లాల్లో ఏర్పాటు చేసే సంస్థలకు ఆ జిల్లా పేరు కలిసివచ్చేలా పేరు పెట్టాల్సి ఉంటుంది.