సీఎం రేవంత్‌కు 'పునరాలోచన' తప్పదా? ఏడాది పాలనలో.. !
అధికారంలో ఉన్న పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. రివర్స్ అవుతుంది.
అధికారంలో ఉన్న పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. రివర్స్ అవుతుంది. ముఖ్యంగా విపక్షాలను టార్గెట్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే.. అవి వికటించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలన్నది ఆ పార్టీ ప్లాన్. దీనిని రాజకీయ కోణంలో చూసినప్పుడు తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
అయితే.. ఆ ప్లాన్ బెడిసికొడితేనే ఇబ్బంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు.. ఈ తరహాలోనే ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. బీఆర్ ఎస్‌పై ఆయన కసితో ఉండొచ్చు. రాజకీయ వైరం మేరకు ఆ పార్టీని కోలుకోకుండా చేయాలని కూడా భావించవచ్చు. కానీ, ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం పెద్దగా ఫలించకపోవడం.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలన ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సమయంలో ఇప్పుడు ఆసక్తిగా మారింది.
1) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం: ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చారు. గత బీఆర్ ఎస్ ప్రబుత్వం ఉన్నతాధికారులను వినియోగించి.. ఎన్నికల కు ముందు ఈ తతంగాన్ని నడిపించిందనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున దీనిపై విచారణ కూడా సాగింది. ఇంకేముందు.. బీఆర్ ఎస్ కీలక నాయకుడు కేటీఆర్ అరెస్టు ఖాయమని అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు కేసు విచారన జరుగుతూనే ఉంది. కేటీఆర్ సేఫ్‌గానే ఉన్నారు.
2) బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు: తద్వారా.. ప్రతిపక్షాన్ని నిలువరించాలన్నది సీఎం రేవంత్ ప్లాన్. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లి మరీ అరిక పూడి గాంధీ వంటివారిని పార్టలో చేర్చుకున్నారు. కానీ, ఇది సొంత పార్టీలోనే బెడిసి కొట్టింది. బీఆర్ ఎస్‌పై సానుభూతి పెంచేలా చేస్తున్నారంటూ.. జీవన్ రెడ్డి వంటి వారు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు.. కేసులు కూడా కొనసాగుతున్నాయి.
3) హైడ్రా: మూసీ నది ప్రక్షాళన చేయడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినా.. హైడ్రా పేరుతో ఈ ఏడాది జూలైలో తెచ్చిన వ్యవస్థ సాధారణ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడింది. పడలేదని ప్రభుత్వం చెబుతున్నా.. రియల్ వర్గాలు మాత్రం వెంచర్లు నిలుపుదల చేసుకున్నాయి. పైగా.. ఈ వ్యవహారంలో బీఆర్ ఎస్ నాయకులను హైడ్రా నిలువరించలేక పోయింది.
ఇలా.. పలు కీలక అంశాల్లో రేవంత్‌రెడ్డి వేసిన అడుగులు సమీక్షకు గురయ్యాయనే చెప్పాలి. మరి ఆయన ఆత్మ విచారం చేసుకుంటారో లేదో చూడాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. బీఆర్ఎస్‌ను దాని మానాన దానిని వదిలేసి ఉంటే.. వేరేగా ఉండేది. కానీ, వీటిని కెలకడం ద్వారా.. ఆ పార్టీకి అనవసర హైప్ ఇచ్చారన్న చర్చ కూడా సాగుతోంది.