55 ఏళ్లకు రేవంత్ సీఎం.. మిగతావారు ఏ వయసులో

వాస్తవానికి 20 ఏళ్ల కిందట రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు ఇంత తొందరగా సీఎం అవుతానని రేవంత్ ఊహించి ఉండరు.

Update: 2023-12-06 04:15 GMT

మండల స్థాయి పదవి అయిన జడ్పీటీసీ సభ్యుడి నుంచి 17 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే.. మాటలు కాదు. కాలం కలిసిరావాలి.. నాయకత్వ పటిమ ఉండాలి.. రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలి.. సొంత పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కొనాలి.. ఎదుటి పార్టీ శత్రువులను మట్టికరిపించాలి.. ఇదంతా ఉంటూనే, అధిష్ఠానం స్థాయిలో మంచి మార్కులు పడాలి.. ఇవన్నీ సాధించారు ఎనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణకు కాంగ్రెస్ తరఫున తొలి సీఎంగా చరిత్రలో నిలవనున్నారు.

అంచలంచెలుగా అనూహ్యంగా

రేవంత్ 1968 నవంబరులో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 55. ఈ లెక్కన ఆయనకు మరో 20 ఏళ్ల వరకు గొప్ప భవిష్యత్ ఉందనడంలో సందేహం లేదు. వాస్తవానికి 20 ఏళ్ల కిందట రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు ఇంత తొందరగా సీఎం అవుతానని రేవంత్ ఊహించి ఉండరు. కానీ, అలా జరిగిపోయింది. మిడ్జిల్ జడ్పీటీసీగా అన్ని పార్టీల మద్దతుతో గెలవడం ఓ అద్భుతమైతే.. వంద ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలవడం పెను సంచలనం. ఆపై ఏడాదికే ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టడం మరో చరిత్ర. ఇప్పుడు సీఎం కావడం చరిత్రను తిరగరాయడమే.

గొప్ప భవిష్యత్

రేవంత్ 55 ఏళ్లకే సీఎం అవుతున్నారు. అంటే.. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే ఆయన అత్యున్నత పదవిని అలంకరించారు. కనీసం మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటారు. అంటే సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఆయన సొంతం. ఈ ఐదేళ్ల కాలంలో సీఎంగా ఎలాంటి మార్పులు తెస్తారనేదానిపైనే రేవంత్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని రేవంత్ ఎలా సమాధానపరుస్తారో చూడాలి.

చంద్రబాబు, కేసీఆర్ సరసన..

దాదాపు 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఏపీ సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు. అంత తక్కువ వయసులో ఇప్పటివరకు ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ చివరి సీఎం. ఆయన 2010లో ఉమ్మడి ఏపీలో సీఎం అయ్యారు. అప్పటికి ఆయనకు 51 ఏళ్లు. తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ దాదాపు 59 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీలో వైఎస్.. 55 ఏళ్లకు సీఎం అయ్యారు. చంద్రబాబు రికార్డును వైఎస్ జగన్ 2014లో ఛేదిస్తారని అనిపించింది. అప్పటికి ఆయన వయసు 43 ఏళ్లే. కానీ, ఎన్నికల్లో ఓటమితో జగన్ కోరిక నెరవేరలేదు. కాగా, ఎన్టీఆర్ 60 ఏళ్లు దాటాక సీఎం అయ్యారు. ఈ లెక్కన రేవంత్ కు కాస్త ముందుగానే గొప్ప పదవి దక్కింది. మరి దీనిని ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News