యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్... రేవంత్ కామెంట్స్ వైరల్!

ఇందిరాగాంధీ హయాంలో పేదలు ఎక్కువై ఆకలితో అల్లాల్లాడుతూంటేనే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అధికారంలోకి వచ్చి వారి ఆకలి తీర్చారని కేసీఆర్ ప్రసంగించారు.

Update: 2023-11-21 04:04 GMT

గతకొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు తెగ మారుమ్రోగిపోతుంది! కారణం ఏమిటనేది తెలిసిన విషయమే అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఎన్టీఆర్ పేరును వాడేశారు కేసీఆర్. ఇందులో భాగంగా ఇందిరమ్మ పాలన బాగాలేదు కాబట్టే ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీని స్థాపించాల్సి వచ్చిందని.. కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని ప్రకటించి పేదలకు ఆకలి తీర్చింది ఎన్టీఆర్ అని అన్నారు.

ఇందిరాగాంధీ హయాంలో పేదలు ఎక్కువై ఆకలితో అల్లాల్లాడుతూంటేనే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, అధికారంలోకి వచ్చి వారి ఆకలి తీర్చారని కేసీఆర్ ప్రసంగించారు. మరి అంత అద్భుతమైన పాలన ఇందిరమ్మ హయాంలో చేసి ఉంటే టీడీపీ ఎందుకు పుట్టింది అనే ప్రశ్నను సంధించారు. దీంతో తాజాగా ఆ విమర్శలపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ తెరపైకి తెచ్చారు!

అవును... తాజాగా ఇందిరమ్మ రాజ్యంపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యమని విమర్శిస్తున్న కేసీఆర్‌ కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని, ఆ విషయాన్ని ఆయన విస్మరించడం దారుణమని అన్నారు రేవంత్ రెడ్డి. తాజాగా పరకాల, నర్సాపూర్‌ లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు!

ఇందులో భాగంగా... సిద్దిపేటలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ గా కేసీఆర్‌ కు అవకాశమిచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని తెలిపిన రేవంత్ రెడ్డి... ఆయనను యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్‌ గాంధీ నియమించారని.. ఆ విషయం మరచిపోయి గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం అంటే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమే అని ఫైరయ్యారు. ఇదే సమయంలో.. దళితులకు, గిరిజనులకు ఎసైన్డ్‌ పట్టాలు ఇచ్చింది.. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని రేవంత్ గుర్తుచేశారు!

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది.. ఏ గ్రామానికెళ్లినా గుడి, బడి, నీటిట్యాంకు, కరెంటు తెచ్చింది.. ఎస్సీ, ఎస్టీలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది.. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది.. పేదలకు ఇళ్లతో నిలువ నీడనిచ్చింది.. పోడు భూములకు పట్టాలిచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని చెప్పుకొచ్చిన రేవంత్... అలాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక సెప్టెంబరు 17న సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారని.. ఆమె గ్యారంటీ అంటే సువర్ణాక్షరాలతో లిఖించదగిన శిలాశాసనం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా... తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి.. రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు! అయితే రాష్ట్రం ఏర్పడిన ఈ పదేళ్లలో కేసీఆర్‌ నట్టేట ముంచారని... రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని తెలిపారు!

Tags:    

Similar News