నాగపూర్ సభలో రేవంత్ హైలెట్.. దేశవ్యాప్త సంచలనం!
తాజాగా కాంగ్రెస్ పార్టీ 139వ పుట్టిన రోజు(ఆవిర్భావం)ను మహారాష్ట్రలోని నాగపూర్‌లో నిర్వహించారు.
తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించారు. తెలంగాణను ఇచ్చామని చెప్పుకొన్నప్పటికీ.. అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీని దాదాపు పదేళ్ల తర్వాత.. అధికారం లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మెరిసారు. ఆ తర్వాత.. మళ్లీ తాజాగా మరోసారి రేవంత్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. ఆయన చుట్టూ నేషనల్ మీడియా గిరికీలు కొట్టింది.
ఏంటి కారణం?
తాజాగా కాంగ్రెస్ పార్టీ 139వ పుట్టిన రోజు(ఆవిర్భావం)ను మహారాష్ట్రలోని నాగపూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తనదైన వాక్చాతుర్యంతో ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. 'ప్రతి మెడిసిన్‌కు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు నరేంద్రమోడీ అనే మెడిసిన్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది' అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాక్యలు సభలో దుమ్మురేపాయి. రాబోయే రోజుల్లో మోడీ అనే మెడిసిన్ దేశంలో పని చేయదని పేర్కొన్నారు.
ఇసారి ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగాల జెండా ఎగరడం ఖాయమని(ఆగస్టు 15న).. దీనిని మోడీ కూడా ఆపలేరని రేవంత్ సభలో కీలక నేతల కరతాళ ధ్వనుల మధ్య వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఇదివరకే చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని, 150 రోజుల వరకు సాగిన ఈ యాత్రలో ఆయన 4 వేలకు పైగా కిలోమీటర్లు నడిచారని అన్నారు.
భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కర్ణాటక తర్వాత జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించిందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొ న్నారు. తెలంగాణ నుంచి ఈ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందని, కాబట్టి, ఈసారి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ను మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నా రని.. ఈ దెబ్బకు కేంద్రంలో కాంగ్రెస్ రావడం పక్కా అని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే.. `అదానీ, ప్రధాని ఇంజన్ సర్కార్` అని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సోనియా సైతం చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. లోక్‌సభలో రాహుల్ గొంతు విప్పడంతో అదానీ ఇంజన్ ఆగిపోయి షెడ్‌కు వెళ్లిందని తూర్పారపట్టారు. ఇప్పుడు భారత్ న్యాయ యాత్రతో ప్రధాని ఇంజన్ ఆగిపోవడం ఖాయమని, దాన్ని షెడ్డుకు పంపడం తథ్యమని అన్నారు.