కాంగ్రెస్ లో 'జెట్టి'.. ఎవరీ 'కేజీఎఫ్' కుసుమ కుమార్..?
కేజీఎఫ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరిట సమావేశాల వెనుక ప్రధాన పాత్ర పోషించినది జెట్టి కుసుమ కుమార్.
తెలుగు రాష్ట్రాల్లో తాజాగా చర్చనీయాంశం అయిన సమావేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి ‘‘కమ్మ గ్లోబల్ ఫెడరేషన్’’ సదస్సు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మవారిని ఒక దగ్గరకు చేర్చే ఉద్దేశంతో ఈ సదస్సు తలపెట్టినట్లు స్పష్టం అవుతోంది. దీనికి కర్ణాటక, తమిళనాడు, ఏపీ నుంచి కూడా ప్రజా ప్రతినిధులుగా, ప్రముఖ వ్యక్తులుగా ఉన్న కమ్మ వ్యక్తులు హాజరయ్యారు. ఇతర దేశాల్లో స్థిరపడి ఆయా రంగాల్లో రాణిస్తున్నవారూ పాల్గొన్నారు.
ఎక్కడిదీ కేజీఎఫ్?
కేజీఎఫ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరిట సమావేశాల వెనుక ప్రధాన పాత్ర పోషించినది జెట్టి కుసుమ కుమార్. దీంతోనే.. ఇంతటి పెద్దఎత్తున సమావేశాల నిర్వహణకు కారణమైన ఎవరీయన? అనే చర్చ మొదలైంది. ఆయన నేపథ్యం ఏమిటనే ఆరాలు తీయడం జరుగుతోంది. జెట్టి కుసుమ కుమార్ పక్కా కాంగ్రెస్ వాది. తెలంగాణకు చెందిన నాయకుడు. స్వస్థలం సంగారెడ్డి. ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు. అలా కాంగ్రెస్ తో అనుబంధం పెనవేసుకున్నారు. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గంలో అత్యధికులు తెలుగు దేశం వ్యవస్థాపన అనంతరం ఆ పార్టీకి బలమైన మద్దతుదారులుగా మారారు. కానీ.. కుసుమకుమార్ మాత్రం మొదటినుంచి కాంగ్రెస్ లోనే కొనసాగారు. అంతేకాదు.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డికి అత్యంత సన్నిహితులు.
వైఎస్ తో బంధం.. రేవంత్ తో చదువు
కుసుమ కుమార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద బలమైన పరిచయాలు ఉన్నాయి. జగ్గారెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానానికి దగ్గర చేసింది ఆయనే. జగ్గారెడ్డిని హై కమాండ్ తో నేరుగా టచ్ లోకి తీసుకెళ్లేంత పరిచయాలు కుసుమ కుమార్ కు ఉన్నాయి. కాగా, మాజీ సీఎం వైఎస్ తో, తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో ఒకే విధమైన సాన్నిహిత్యం ఉన్న నాయకుడు ఈయన. వైఎస్ ప్రతిపక్ష నేత, సీఎంగా ఉన్నప్పుడు కుసుమ కుమార్ ఆయన వెంటనే పర్యటనలకు వెళ్లేవారు. ప్రజలు ఇచ్చే వినతులను వైఎస్ స్వీకరించి.. నేరుగా కుసుమ కుమార్ చేతుల్లో పెట్టేవారు. ఇక రేవంత్ రెడ్డికి కుసుమ కుమార్ క్లాస్ మేట్. ఏవీ కాలేజీకి ఇద్దరూ బెంచ్ మేట్స్. ఇదే విషయం ఇప్పటికే పలుసార్లు మీడియాలో వచ్చింది కూడా.
కేజీఎఫ్ తో పేరు..
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటూ నిర్వహించిన సదస్సుతో కుసుమ కుమార్ పేరు ఇప్పుడు మరింత మందికి తెలిసింది. వాస్తవానికి కేజీఎఫ్ ఆలోచన రెండేళ్ల కిందటనే వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. దీనిని కుసుమ కుమార్ తో పంచుకున్నట్లు కూడా తెలిపారు. అంటే.. తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో చాలా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం ఇది అనుకోవాలి. బీఆర్ఎస్ ఆధిక్యానికి గండికొట్టే ఆలోచన కూడా. కాగా, కుసుమ కుమార్ కు దశాబ్దాలుగా కాంగ్రెస్ తో బంధం ఉన్నప్పటికీ ఇప్పటివరకు పార్టీ పదవులే తప్ప ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నికవలేదు. ప్రుభుత్వంలోనూ ఎలాంటి పదవులూ చేపట్టలేదు. దీనికి కారణాలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ పరంగానా? అన్నది తెలియదు. ఇకమీదట కుసుమ కుమార్ కు మంచి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.