నాడు జైపాల్ రెడ్డి .. నేడు రేవంత్ రెడ్డి !

మొదట వీరి వివాహాన్ని వ్యతిరేకించిన జైపాల్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

Update: 2024-05-10 17:30 GMT

తెలంగాణ రాజకీయాలలో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ప్రస్తానం అందరికీ స్ఫూర్థిదాయకం. ఆయన పలుమార్లు ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డులు అందుకున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు, శిష్యులు ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి జైపాల్ రెడ్డి సోదరుడి కూతురే. మొదట వీరి వివాహాన్ని వ్యతిరేకించిన జైపాల్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

అయితే ఉత్కంఠగా సాగుతున్న మహబూబ్ నగర్ లోక్ సభ పోరులోకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డీకె అరుణ దివగంత జైపాల్ రెడ్డిని లాగారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్, డీకె అరుణల మధ్య మాటల యుద్దం నడుస్తున్నది. ఈ స్థానం ప్రతిష్టాత్మకం అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ‘‘అడ్డొచ్చిన వాళ్లను పండబెట్టి తొక్కుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంటుకు తీసుకెళ్తానని’’ రేవంత్ చెప్పిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆడబిడ్డను అయిన తనను పరుషపదజాలంతో విమర్శించడాన్ని అరుణమ్మ తీవ్రంగా తప్పుపట్టింది.

అయితే మక్తల్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరుణకు సోదరుడు కాగా, నారాయణపేట ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అరుణకు స్వయానా మేనకోడలు. ఈ నేపథ్యంలో అరుణ మాట్లాడుతూ ‘‘అధికారం ఉందని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, మేనత్తను అయిన తనను కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అవమానిస్తూ మాట్లాడుతుంటే ఖండించక పోగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి నవ్వుతున్న తీరు విస్మయం కలిగిస్తుందని’’ వాపోయింది.

ఇటీవల శాసనసభ ఎన్నికలలో తనకు మేనత్త ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకున్న పర్ణికారెడ్డి ఇప్పుడు మేనమామను వెంటేసుకుని ఊరూరూ తిరుగుతూ తనను తిడుతున్న వారితో అంటకాగుతున్నారని అరుణ విమర్శించింది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి మామ జైపాల్ రెడ్డి తన తండ్రి దివంగత చిట్టెం నర్సిరెడ్డిని అణగదొక్కారని, ఇప్పుడు రేవంత్ తనను అణగదొక్కాలని చూస్తున్నాడని అరుణ ఆరోపించింది. నర్సిరెడ్డి వారసులను అణచాలని చూస్తే పొలిమేరల దాకా తరిమికొడతామని హెచ్చరించింది. తన తల్లి గారి ఊరైన స్వంత మండలం ధన్వాడలో అరుణ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలకు అతీతంగా ధన్వాడ వాసులు తనకు మద్దతు తెలపాలని కోరింది.

Tags:    

Similar News