రేవంత్ పాలనకు 30 రోజులు.. ఎన్ని మార్కులు?
వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది.
తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడింది కాంగ్రెస్ సర్కారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ పదేళ్లు పవర్ లోకి రాలేకపోయింది హస్తం పార్టీ. వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ఆ పార్టీ విఫలమైంది. అందుకే ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పట్టుదలగా పోరాడి అధికారం చేజిక్కించుకుంది. ఇందులో కీలకపాత్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది. పార్టీ గెలిచిన అనంతరం మరో మాట లేకుండానే ఆయనను ముఖ్యమంత్రి అయ్యారు.
నెలలో ఇదీ ముద్ర
డిసెంబరు 7న తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఆదివారంతో నెల రోజులు పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాలనకు మంచి మార్కులే పడే అవకాశం ఉంది. రేవంత్ సీఎంగా తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. అందులో మరీ ముఖ్యమైనది.. గత ప్రభుత్వ హయాంనాటి ప్రగతి భవన్ ను సద్వినియోగం చేయడం. ప్రతిపక్షంలో ఉండగా ప్రగతి భవన్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దానిని కూలగొట్టలేదు. ప్రజా పాలనకు వేదికగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయించారు. తద్వారా విధ్వంస పాలన అనే భావన రాకుండా చూశారు.
ప్రజా పాలనతో..
కేసీఆర్ సీఎంగా ఉండగా ప్రజా ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రగతి భవన్ లో అవకాశం ఇవ్వలేదు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఒకటి.. ప్రగతి భవన్ లో ప్రజల ఫిర్యాదుల స్వీకరణ. తదనంతరం దీనికి ప్రజా వాణిగా పేరుమార్చారు. ఇక కొత్త రేషన్ కార్డులు సహా ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజా సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సానుకూలతనే పొందింది.
విద్యారంగంపై
పేపర్ల లీకేజీ కారణంగా టీఎస్ పీఎస్సీ నియామకాలు బీఆర్ఎస్ హయాంలో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఉద్యోగార్థుల ఆత్మహత్యలు కేసీఆర్ సర్కారుకు చరమగీతం పాడాయి. ఇలా అప్రదిష్ఠపాలైన టీఎస్ పీఎస్సీని సంస్కరించేందుకు రేవంత్ సర్కారు యూపీఎస్సీ మార్గనిర్దేశం తీసుకుంటోంది. భవిష్యత్ లో పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది.
రాజకీయంగానూ
రేవంత్ సర్కారులో ఉన్నది, కేసీఆర్ ప్రభుత్వంలో లేనిది.. స్వేచ్ఛ. ఇది మంత్రుల విషయంలో స్పష్టమైపోతోంది. స్వేచ్చంగా నిర్ణయాల సంగతి పక్కనపెడితే కనీసం శాఖాపరమైన సమీక్షలు కూడా నిర్వహించలేని స్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేది. అయితే, రేవంత్ సర్కారులో మంత్రులుంతా స్వతంత్రంగా వ్యవహరించేందుకు చాన్సిచ్చారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై సమీక్ష సహా అనేక విషయాల్లో ఇది స్పష్టమైంది. ఇక మంత్రి పదవుల కేటాయింపులోనూ ఎక్కడా విమర్శలకు తావివ్వలేదు. మిగతా 6 పదవుల భర్తీ కూడా సజావుగా పూర్తయితే రేవంత్ సర్కారు పూర్తిస్థాయిలో కొలువుదీరినట్లే.
వ్యక్తిగత విమర్శల్లేవ్..
రేవంత్ ప్రభుత్వంలో ఉన్న మరో ప్రత్యేకత.. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగకపోవడం. విమర్శలకు సంబంధించి ఏ విషయంపైనైనా ఇప్పటివరకు హుందాగా స్పందించారు. తద్వారా గౌరవప్రద రాజకీయాలను కొనసాగిస్తామనే సంకేతాలనిచ్చారు. మరోవైపు పార్టీలో సీనియర్లు కూడా రేవంత్ ప్రభుత్వంపై సానుకూలతతోనే ఉండడం మంచి పరిణామంగానే చెప్పాలి.