"ఆల్ ఐఎస్ ఆన్ రఫా"... రోహిత్ శర్మ సతీమణిపై సెటైర్లు!

రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-05-29 08:07 GMT

రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా సుమారు 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆన్‌ లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు.

అవును... గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్‌ సైన్యం జరుపుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పాలస్తీనా పౌరులకు మద్దతుగా అంతర్జాతీయంగా అనేక మంది సెలబ్రిటీలు ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే "ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా" అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ నేపథ్యంలో టీంఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే కూడా స్పందించారు. ఇందులో భాగంగా... ఇన్‌ స్టా స్టోరీస్‌ లో "ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా" అని రాసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. దీంతో... ఈమె పోస్ట్ పై నెట్టింట విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఆమె స్పందనపై పలువురు నెటిజన్లు కీలక ప్రశ్నలు సందిస్తూ నిలదిస్తూన్నారు.

ఇందులో భాగంగా... కశ్మీరీ పండిట్లు, మణిపుర్‌ లో జరిగిన దారుణాలు.. ఇలా దేశంలో నెలకొన్న ఏ సమస్యపై అయినా ఏనాడైనా మాట్లాడారా..? అని రితికాను ప్రశ్నించిన నెటిజన్లు.. కేవలం నెట్టింట ట్రెండ్‌ ను ఫాలో అవుతూ ఆన్ లైన్ వేదికగా పోస్టులు చేయడం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రితిక ఇన్ స్టా లోని ఆ స్టోరీని తొలగించారు.

మరోపక్క మనదేశానికి చెందిన ప్రముఖ నటీనటులు.. "ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా"తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ స్పందించారు. ఇందులో భాగంగా... సమంత, త్రిష, రష్మిక, దుల్కర్ సల్మాన్‌, పార్వతి తిరువొత్తు, అమీ జాక్సన్, మాళవికా మోహనన్‌, అలియా భట్‌, ప్రియాంకా చోప్రా, కరీనాకపూర్‌, సోనాక్షి సిన్హా, వరుణ్‌ ధావన్‌, త్రిప్తి డిమ్రి, దియా మీర్జా, రిచా చద్దా మొదలైన వారు పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభాన్ని తెలిపిన వారిలో ఉన్నారు.

కాగా... రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయంపై ఇజ్రాయేల్ సైన్యం వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెలీలకు వ్యతిరేకంగా ఉగ్రదాడులు అమలు చేస్తోన్న ఇద్దరు హమాస్‌ నేతలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని.. దాని ఆధారంగానే దాడి జరిపినట్లు వెల్లడించింది.

Tags:    

Similar News