రారా క్రిష్ణయ్యా...కమలం పిలుస్తోంది ?

బీసీ నేతగా ఉన్న ఆర్ క్రిష్ణయ్య వైసీపీని వీడిపోయారు. ఆయన మీద చాలా కాలంగా ప్రచారం అయితే సాగుతోంది.

Update: 2024-09-24 17:30 GMT

బీసీ నేతగా ఉన్న ఆర్ క్రిష్ణయ్య వైసీపీని వీడిపోయారు. ఆయన మీద చాలా కాలంగా ప్రచారం అయితే సాగుతోంది. దానికి ఒకటి రెండు సందర్భాలలో క్రిష్ణయ్య గట్టిగా ఖండించారు. తనకు బీసీ సమస్యల మీద పెద్దల సభలో గొంతు ఎత్తమని జగన్ అవకాశం ఇచ్చారని అలాంటి పార్టీని వీడి ఎలా పోతాను అని మీడియానే ఆయన ప్రశ్నించారు.

అలాంటి క్రిష్ణ చడీ చప్పుడూ లేకుండా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన నిన్ననే రాజీనామా చేసారు అని దానిని ఆమోదించామని రాజ్యసభ ఆఫీస్ ప్రకటించడంతో వెలుగు చూసింది. ఇక క్రిష్ణయ్య ఎందుకు రాజీనామా చేశారు అంటే వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు అయింది.

ప్రస్తుతం ఆ పార్టీ ఇబ్బందులో ఉంది. దాంతో ఆ పార్టీతో పాటుగా అయిదేళ్ల పాటు పోరాడాలి. మరో వైపు చూస్తే క్రిష్ణయ్య తెలంగాణాకు చెందిన వారు. ఆయన ఏపీకి వచ్చి ఎక్కువగా మాట్లాడిందీ లేదు. దాంతో ఆయన రాజకీయం మరింతగా గాడిన పడాలి అంటే జాతీయ పార్టీలో చేరితేనే బెటర్ అని అంచనాకు వచ్చినట్లుగా ఉన్నారు.

దాంతో ఆయన బీజేపీలో చేరుతారు అని పుకార్లు షికారు చేస్తున్నారు. ఏపీలో చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్సీ అయినా రాజ్యసభ అయినా ఏది ఖాళీ అయినా నూరు శాతం గెలుచుకునే సత్తా కూటమికే ఉంది. ఈ రోజు వైసీపీకి రాజీనామా చేసి క్రిష్ణయ్య మాజీ అయినా రేపటి రోజున ఏపీ నుంచి ఆయన బీజేపీ కోటాలో ఎంపీగా తిరిగి రాజ్యసభలో ప్రవేశించే వెసులుబాటు ఉంది.

ఆ రకంగా అన్నీ చూసుకున్న మీదటనే ఆయన రాజీనామా చేశారు అని అంటున్నారు. ఇక బీజేపీకి కూడా క్రిష్ణయ్య అవసరం ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో ఇప్పటికే మాదిగ పోరాటసమితి నాయకుడు మంద క్రిష్ణ మాదిగను తమ వైపుగా బీజేపీ తిప్పుకుంది. ఇటీవలనే సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వచ్చింది. దాంతో పాటుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ మాదిగల పోరాటానికి అందించిన బ్లెస్సింగ్స్ ఉన్నాయి.

దాంతో మంద క్రిష్ణ సహకారం సామాజికపరంగా ఉంటుంది. తెలంగాణాలో యాభైకి పైగా నియోజకవర్గాలలో మాదిగల ప్రభావం గట్టిగా ఉంది. అలాగే తెలంగాణాలో బీసీలు కూడా ఎక్కువ. దాంతో బీసీ పోరాటాన్ని దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ఆర్ క్రిష్ణయ్యను తమతో ఉంచుకుంటే సామాజిక పరంగా బీజేపీకి మరింతగా మేలు జరుగుతుంది అని అంటున్నారు.

అలా బీజేపీకి లాభం. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే రేపటి రోజున లక్ కలసి వస్తే కేంద్ర మంత్రిగా కూడా చాన్స్ దక్కే అవకాశాలు కూడా క్రిష్ణయ్యకు ఉన్నాయి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం దన్నుతో బీసీల సమస్యలను మరింతంగా జాతీయ స్థాయిలో పరిష్కరించుకోగలమని కూడా ఆయన భావిస్తున్నారు.

ఇలా ఎన్నో ఆలోచనల మీదటనే క్రిష్ణయ్య కమలం నీడకు చేరుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే సామాజిక ఉద్యమకారుడిగా ఉన్న క్రిష్ణయ్య మొదట చేరిన రాజకీయ పార్టీ టీడీపీ. ఆ పార్టీ నుంచి తెలంగాణాలో బీసీ సీఎం గా కూడా ఆయన ఫోకస్ చేయబడ్డారు. అలా ఎమ్మెల్యే అయ్యారు. ఇక వైసీపీ నుంచి ఎంపీ గా రాజ్యసభకు వెళ్ళారు. ఇపుడు బీజేపీ లో చేరితే ఆయనకు ఆ పార్టీ ఏ మేరకు అవకాశాలు ఇస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News