రోశయ్య వర్ధంతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ ఈ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రోశయ్య ఉన్నప్పుడు ఆయనే నంబర్ 2 అని, నంబర్ 1 మాత్రమే మారేవారని రేవంత్ అన్నారు. ఆయన ఎప్పుడూ తనపైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని పేర్కొన్నారు.
రోశయ్య అన్నివిధాలా వ్యవహారాలను చక్కబెట్టారు కాబట్టే అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేయగలిగారని రేవంత్ అన్నారు. రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ ఈ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో శాసనసభలో రోశయ్యలా వ్యూహాత్మకంగా సమస్యను పరిష్కరించే నాయకుడు లేరన్న లోటు కనిపిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. సందర్భం, సమయం వచ్చినప్పుడు సోనియాగాంధీ రోశయ్యను ఎంపిక చేశారని, పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేశారు కాబట్టే ఆయనకు గుర్తింపు లభించిందని తెలిపారు.
రోశయ్య తన కాలంలో ఎన్నడు కూడా ఫలానా పదవి కావాలని అడిగిన సందర్భాలు లేవని సీఎం అన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత వల్లే పదవులు వచ్చాయని తెలిపారు. 2007లో తాను శాసనమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తనకు కొన్ని సలహాలు సూచనలు సైతం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇరిగేషన్‌పై చాలా అవగాహన ఉందని, లైబ్రరీకి వెళ్లి మరింత అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుంటుందని తనకు చాలా సందర్భాల్లో సూచించినట్లు తెలిపారు. తనకు సూచనలు ఇచ్చిన రోశయ్యను సైతం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెట్టాల్సి వచ్చిందని ఫీలయ్యారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలని, అధికారంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని ఆ సందర్భంలో రోశయ్య సూచించినట్లు తెలిపారు. ఇప్పుడు అలాంటి స్ఫూర్తి కలిగిన నేత చట్టసభల్లో లేకుండా పోయారని పేర్కొన్నారు. ట్రబుల్ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించారని, అందుకే వైఎస్సార్ పని ఈజీ అయిందని అభిప్రాయపడ్డారు. రోశయ్య 16 ఏళ్లు ఆర్థిక మంత్రిగా పనిచేసినట్లు తెలిపారు. ఆయన సామర్థ్యంతోనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు.
రోశయ్య ప్రతిభను చూసే ఆయనకు అధిష్టానం మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి, గవర్నర్ పదువులు పిలిచి ఇచ్చిందని రేవంత్ తెలిపారు. నిఖార్సయిన హైదరాబాది రోశయ్య అని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విగ్రహం లేకపోవడం లోటేనని అన్నారు. అందుకే హైదరాబాద్‌లో దివంగత నేత, మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.