ఎస్వీబీసీ చైర్మన్ గా ఆయన పేరు ?

గతంలో దీనిని నిర్వహించిన వారు కూడా ప్రముఖులే కావడంతో ఈ పోస్టుని ఈసారి ఎవరికి ఇస్తారు అన్న చర్చ ఉంది.

Update: 2024-12-04 13:34 GMT

ఏపీలో నామినేటెడ్ పదవుల పందేరం కొనసాగుతోంది. ఇంకా కీలకమైన పోస్టులు పెండింగులో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టు తరువాత మరో కీలక పదవిగా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ని చెప్పుకుంటారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పోస్టుగా చూస్తారు. గతంలో దీనిని నిర్వహించిన వారు కూడా ప్రముఖులే కావడంతో ఈ పోస్టుని ఈసారి ఎవరికి ఇస్తారు అన్న చర్చ ఉంది.

ఈ పోస్టులో టీడీపీ హయాంలో కె రాఘవేంద్రరావు పనిచేశారు. ఇక వైసీపీ హయాంలో మొదట సినీ నటుడు పృథ్వీరాజ్ కి ఇచ్చారు. వివాదాల కారణంగా ఆయన మూడు నెలలకే ఈ పదవి నుంచి దిగిపోయారు. ఇపుడు మళ్లీ ఈ పోస్టు విషయంలో భారీ ఎత్తున చర్చ సాగుతోంది.

ఈ పోస్టుకు ఎవరికి అంటే చాలా పేర్లు ముందుకు వస్తున్నాయి. ఈ పోస్టు కోసం పోటీ పడుతున్న వారిలో సినీ రంగం నుంచే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అందులో మొదటి పేరు ప్రముఖ నిర్మాత కె అశ్వనీదత్ ఉన్నారని అంటున్నారు. ఆయన తరువాత సీనియర్ నటుడు మురళీ మోహన్ పేరు కూడా ఉంది. ఇక మూడవ పేరుగా మరో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేరు ఉంది.

ఈ ముగ్గురూ కూడా టీడీపీ సానుభూతిపరులే. అందులో అశ్వినీదత్ మురళీమోహన్ ఎంపీలుగా టీడీపీ తరఫున పోటీ చేశారు. పార్టీలో వారు ఒకపుడు కీలకంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ స్ట్రాంగ్ సపోర్టర్ గా టీడీపీకి ఉంటూ వస్తున్నారు. ఆయన ఇటీవల టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడుని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కూడా.

ఇవన్నీ ఇలా ఉంటే జనసేన నుంచి ఈ కీలక పదవికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అన్నది తెలిసిందే. ఇటీవల పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి చేసుకుని స్వామి వారిని దర్శించుకున్నపుడు ఆయన వెంట త్రివిక్రం కూడా ఉన్నారు. ఈ చానల్ ని తనదైన టాలెంట్ తో మరింత బాగా నడుపుతారు త్రివిక్రమ్ అని జనసేన అధినాయకత్వం భావిస్తోంది.

అంతే కాదు టీటీడీ చైర్మన్ పదవి కోసం మొదట జనసేన నుంచి ఇస్తారని వినిపించింది. కానీ ఆ పదవి టీడీపీకి వెళ్ళింది. దాంతో ఎస్వీబీసీ చైర్మన్ పోస్టు జనసేనకు ఇస్తారని అంటున్నారు. అంతే కాదు టీటీడీ చైర్మన్ ఎస్వీబీసీ చైర్మన్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం అంటే సామాజిక సమీకరణలు సరిపోవని అంటున్నారు

టీడీపీ నుంచి ఈ పదవి ఆశిస్తున్న ముగ్గురూ టీటీడీ చైర్మన్ సామాజిక వర్గానికి చెందిన వారే అని అంటున్నారు. అయితే టీడీపీలో వీరు కాకుండా వేరే ఎవరి పేరు అయినా ప్రతిపాదనకు వస్తే మాత్రం గట్టి పోటీ ఉంటుందని అంటున్నారు. ఈ పదవి కోసం జనసేన కూడా పట్టుబడుతూండడంతో ఆ పార్టీకి వదిలేస్తారు అన్న మాట కూడా ఉంది. అదే జరిగితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ కీలక హోదా దక్కే చాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో.

Tags:    

Similar News