వైరల్ టాపిక్... రష్యా అధ్యక్షుడు బాడీ డబుల్స్‌ ను ఉపయోగిస్తున్నారా?

వాస్తవానికి... గత ఏడాది ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన దగ్గరి నుంచి పుతిన్‌ అనారోగ్యం గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-10-24 17:59 GMT

71 ఏళ్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అక్టోబర్ 22 ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చిందని.. దీంతో మంచం మీద నుండి పడిపోయారని.. అలా పడిపోయే క్రమంలో టేబుల్ అతని ముఖానికి తగిలిందని.. దీంతో ముక్కుకు తీవ్ర గాయం అయ్యి రక్తస్రావం జరిగిందని వార్తలు అంతర్జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో పుతిన్ ప్లేస్ లో ఉన్నది అతని డూప్ అనే చర్చ కూడా మొదలైంది. దీంతో... క్రెమ్లిన్ ప్రతినిధి స్పందించారు.

అవును... పుతిన్ కు గుండెపోటు రావడంతోపాటు తీవ్రగాయాలయ్యాయని, అది గమనించిన భద్రతా సిబ్బంది.. వైద్యుడికి సమాచారం అందించినట్టు కథనాలు వెలువడ్డాయి! దీంతో... పుతిన్ ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఇప్పుడు పుతిన్ స్థానంలో ఉన్నది ఆయన డూప్ అని కథనాలు హల్ చల్ చేయడం మొదలుపెట్టాయి! ఈ నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ స్పందించారు. అవన్నీ అసంబద్ధ ప్రచారమని కొట్టిపారేశారు.

ఇందులో భాగంగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలను అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఫిట్ గా ఉన్నారని అది స్పష్టం చేసింది. అలాగే రష్యా అధ్యక్షుడు డూప్‌ ను ఉపయోగిస్తారంటూ జరుగుతోన్న ప్రచారంపైనా అధికారులు స్పందించారు. అవన్నీ అసత్య, అసంబద్ధ ప్రచారమని కొట్టిపారేశారు.

వాస్తవానికి... గత ఏడాది ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన దగ్గరి నుంచి పుతిన్‌ అనారోగ్యం గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో క్యాన్సర్, పార్కిన్సన్స్‌ వంటి రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారని అనేక కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో... పుతిన్ డూప్ ఇప్పుడు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారంటూ వస్తున్న కథనాలు గతంలో కూడా వచ్చిన సంగతీ తెలిసిందే.

కాగా... తాను డూప్‌ ను ఉపయోగిస్తానంటూ సుదీర్ఘకాలంగా వస్తోన్న కథనాలపై 2020లోనే పుతిన్ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు. ఇదే సమయంలో పుతిన్ అనారోగ్య వార్తలు సైతం అసత్య ప్రచారాలంటూ క్రెమ్లిన్‌ ఖండిస్తుంది.

ఇదే క్రమంలో... ఇప్పుడు కూడా గుండెపోటు, ముక్కుకి గాయం, తీవ్ర రక్తస్రావం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని కూడా క్రెమ్లిన్ తోసిపుచ్చడంతో ఇదంతా అసత్యమేనని తేలిపోయింది. ఇదే సమయంలో ఆయన ప్రస్తుతం ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్దంపై దృష్టిపెట్టారని, ఆ వ్యూహాల్లో బిజీగా ఉన్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News