బిగ్ బ్రేకింగ్... సీఎం రేవంత్ తో సినిమా ఇండస్ట్రీ భేటీ ఫిక్స్!
తెలంగాణ ప్రభుత్వానికీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ వచ్చిందని.. అది రోజు రోజుకీ పెరుగుతుందని ఒకరంటే...
తెలంగాణ ప్రభుత్వానికీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ వచ్చిందని.. అది రోజు రోజుకీ పెరుగుతుందని ఒకరంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ ని వదిలి వెళ్లేపోయే అవకాశాలున్నాయని మరొకరు అంటున్న పరిస్థితి. ఈ తరహా ప్రచారం రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణాం తెరపైకి వచ్చింది.
అవును... సినిమా ఇండస్ట్రీకి - తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందని.. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియదని.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం ఈ స్థాయిలో స్పందించడానికి ఆ గ్యాపే కారణం అని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నాయని అంటున్న వేళ ఓ ఆసక్తికర ప్రకటన వచ్చింది.
ఇందులో భాగంగా... రేపు (గురువారం - 26 డిసెంబర్) న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కలవబోతున్నారని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఈ మీటింగ్ జరగనుందని తెలిపారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఈ రోజే వచ్చిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా కలిసే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని దిల్ రాజు తెలిపారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరుపున ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. అయితే... ఈ మీటింగ్ పాయింట్ ఎక్కడ అనేది మాత్రం సీఎంవో నుంచి సమాచారం రావాల్సి ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో... ఈ మీటింగ్ కి అల్లు అరవింద్ తో పాటు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరినీ తీసుకెళ్లాలసిన బాధ్యత, అటు ప్రభుత్వంతో కలిసి మాట్లాడించాల్సిన బాధ్యత తనపై ఉందని ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇప్పుడు ఈ ప్రకటన ఆసక్తిగా మారింది.
కాగా.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న శ్రీతేజ్ ను ఈ రోజు ఎఫ్.డీ.సీ. ఛైర్మన్ దిల్ రాజు, ‘పుష్ప-2’ నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా తండ్రి భాస్కర్ ని కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా... అల్లు అర్జున్ తరుపున రూ.కోటి.. పుష్ప-2 నిర్మాత తరుపున రూ.50 లక్షలు.. దర్శకుడు సుకుమార్ తరుపున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించిన అల్లు అరవింద్... దీనికి సంబంధించిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగానే దిల్ రాజు ఈ ప్రకటన చేశారు.