'రైతు భరోసాపై యూటర్న్'... ఢిల్లీలో తెలంగాణ పోస్టర్ల కలకలం!
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆరెస్స్ ప్రభుత్వం "రైతు బంధు" పేరిట సాయం అందించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో "రైతు భరోసా" పేరిట సాయం అందించనుందని చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రైతు భరోసా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ రైతు భరోసా నుంచి ప్రజల దారి మళ్లించేందుకే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం, నేడు కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు అంటూ బీఆరెస్స్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేపాయి.
అవును... తెలంగాణ రాష్ట్రంలో గత బీఆరెస్స్ ప్రభుత్వం "రైతు బంధు" పేరిట సాయం అందించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో "రైతు భరోసా" పేరిట సాయం అందించనుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... గతంలో కంటే రూ.2 వేలు అదనంగా ఇవ్వనున్నామని.. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుందని తెలిపారు.
అయితే.. రైతు భరోసా అమలుకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలపై రైతుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది అంటూ బీఆరెస్స్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో మంత్రి పోంగులేటి స్పందించారు. ఇందులో భాగంగా... వేలాది మంది రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే... రైతులకు ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకూ ఈ పథకం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు. ఈ సమయంలో ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద కొన్ని పోస్టర్లు కలకలం రేపాయి.
ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం వద్ద "కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్" పేరిట పోస్టర్లు కలకలం రేపాయి. ఇందులో భాగంగా.. "తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు ఎకరానికి రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఒక్క రూపాయి విడుదల చేయలేదు" అని పోస్టర్స్ వేలిశాయి
ఇదే సమయంలో సీఎం రేవంత్ యూటర్న్ తీసుకున్నారని.. ఎకరాకు రూ.12,000 ఇస్తామంటున్నారని అందులో రాసుకొచ్చారు! దీంతో.. ఈ పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి! వీటిని ఎవరు అతికించారనే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించిందని తెలుస్తోంది.