భూస్వాములకు రైతుబంధుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అయితే... వాస్తవంగానే ఈ విషయంలో కొన్ని వ్యతిరేకతలు వచ్చిన సంగతి తెలిసిందే

Update: 2024-01-12 13:15 GMT

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయంగా డబ్బు అందిస్తూ ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకురావటమనేది బీఆరెస్స్ ప్రభుత్వానికే చెందిన ఘనత అని.. ఈ పథకాన్ని తెలంగాణ సమాజమే కాదు, దేశమంతా ప్రశంసించిందని గతంలో కేటీఆర్ బలంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పథకంపై కూడా విమర్శలు చేస్తున్నారని నాడు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే... వాస్తవంగానే ఈ విషయంలో కొన్ని వ్యతిరేకతలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కౌలురైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో భూస్వాములకు రైతు బంధు వేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పలువురు భూస్వాములు విదేశాల్లో ఉండి కూడా రైతు బంధు తీసుకున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయాలపై కేటీఆర్ స్పందించారు.

అవును... భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న సందర్భంగా కేటీఅర్ పలు కీలక విషయాలపై స్పందించారు. తన తప్పులను ఒప్పుకుంటున్నట్లు, బాధ్యత తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగానే భూస్వాములకు రైతుబంధు ఇవ్వడంపైనా స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... పాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని, అందుకు తనదే బాధ్యత అని మొదలుపెట్టిన కేటీఆర్.. ఎన్నికల్లో ప్రజలు తప్పుచేశారని అనడం సరైంది కాదని, బీఆరెస్స్ నేతలు ఇకపై అలా మాట్లాడొద్దని సూచించారు. గడిచిన రెండు సార్లు బీఆరెస్స్ ను గెలిపించింది కూడా ఈ ప్రజలేనని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 14 చోట్ల అతి తక్కువ తేడాలో బీఆరెస్స్ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు.

ఇదే సమయంలో... పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని ఒప్పుకున్న కేటీఆర్... దళితబంధు కొందరికే రావడంతో మిగతావారు వ్యతిరేకమయ్యారని అన్నారు. పైగా.. ఈ పథకంపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. అదేవిధంగా... భూస్వాములకు రైతుబంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు వ్యతిరేకించారని స్పష్టంచేశారు.

కాగా.. ఎన్నికల ముందు నవంబర్ లో ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా... రైతుబంధు లబ్ధి పొందుతున్న చాలా మంది భూస్వాములేనని.. కొంతమంది విదేశాల్లో ఉండి కూడా నగదు తీసుకుంటున్నారన్న వాదనతో ఏకీభవించారు. ఈ సమయంలో భూస్వాములకు రైతుబంధు ఎందుకన్నది తన మనసులో కూడా ఉందని.. భూమి పరిమితిపై బీఆరెస్స్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాని భావిస్తున్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే కామెంట్లు వినిపించాయి. ఇదే సమయంలో... కౌలురైతు సమస్యను కూడా దృష్టిలో పెట్టుకుంటామనే విషయాన్ని స్పష్టం చేయలేకపోయారు. కౌలురైతు చట్టం అమలులో ఉందని చెప్పారు. ఇవి కూడా నాడు బీఆరెస్స్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ సమయంలో కేటీఆర్ ఈ విషయంపై పై విధంగా స్పందించారు.

Tags:    

Similar News