పవన్ కల్యాణ్ పరువు పాయే!
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన భూములపై వారి పరిశీలనలో తెలుసుకున్న విషయాలు వెల్లడించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మూడు లేఖలు, నాలుగు ప్రెస్ మీట్లు, ఐదు ఆరోపణలు, ఆరు విమర్శలు అన్నట్లుగా వ్యవహరం సాగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సరస్వతీ పవర్ సంస్థకు చెందిన భూములకు సంబంధించి ఆసక్తికర ఘటన తెరపైకి వచ్చింది.
అవును... సరస్వతీ పవర్ సంస్థకు చెందిన షేర్ల వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే... ఈ సంస్థకు సంబంధించిన భూముల విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదని అంటుంటారు. కాకపోతే.. జగన్ మీద కేసులు పెండింగులో ఉండటంతో.. సరస్వతీ పవర్ భూములు కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి.
అంటే.. వాటిని అనుభవించగలరు తప్ప ఇతర లావాదేవీలు చేయలేరన్నమాట! ఆ సంగతి అలా ఉంటే... ఈ సంస్థకు చెందిన భూములపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఆ భూముల్లో అటమీ భూములు, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇలా డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ శాఖ అధికారులు స్వయంగా హుటా హుటిన వెళ్లి.. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూమూలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు సంబంధించిన భూములపై వారి పరిశీలనలో తెలుసుకున్న విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... సరస్వతీ పవర్ సంస్థకు మాచవరం మండలంలోని మూడు గ్రామాలలో ఉన్న భూములు అన్నీ పట్టా భూములే అని తేల్చారు. చెన్నాపాలెంలో 272.96 ఎకరాలు.. పిన్నెల్లిలో 93.79 ఎకరాలు.. వేమవరంలో 710.63 ఎకరాలు కలిపి మొత్తంగా 1073.38 ఎకరాలు ఉన్నాయని.. అవన్నీ కూడా పట్టా భూములే అని స్పష్టం చేశారు.
ఈ భూముల్లో చెరువులు కానీ.. వాగులు, కుంటలు వంటివి ఏమీ లేవని.. వాటర్ పాల్స్ వంటివీ లేవని రెవిన్యూ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో... వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ను గట్టిగా తగులుకుంటున్నారు! సబ్జెక్ట్ పై అవగాహన లేకుండా పవన్ అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు!
జగన్ ఫ్యామిలీలో ఆస్తుల కు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్న వేళ సరస్వతీ పవర్ సంస్థ ల్యాండ్స్ ని సర్వే చేయించమని ఆదేశిస్తే... అవన్నీ పక్కాగా పట్టా భూములంటూ రెవిన్యూ అధికారులు స్పష్టంగా వెల్లడించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో.. పవన్ పరువు పాయే అనే చర్చ సామాన్య ప్రజానికంలోనూ మొదలైందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ భూములపై సర్వే చేసిన అధికారులు ఇచ్చిన వివరణకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. "మొత్తం పరువు పోయిందిగా.." అంటూ కామెడీ బిట్స్ జోడించి నెట్టింట రచ్చ చేస్తున్నారు.